యూపీఏ అంటే ఏమిటంటూ మమత చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ స్పందన!

02-12-2021 Thu 12:16
  • యూపీఏ ఇప్పుడుందా? అని ప్రశ్నించిన మమత
  • విపక్షాలు ఐకమత్యాన్ని ప్రదర్శించాలన్న కపిల్ సిబాల్
  • అందరం కలిసి బీజేపీని ఎదుర్కోవాలన్న మల్లికార్జున ఖర్గే
Congress Reacts To Mamata Banerjee comments on UPA
బీజేపీకి ప్రత్యామ్నాయం కోసం పశ్చిమబెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తీవ్రంగా కృషి చేస్తున్నారు. దేశంలోని వివిధ పార్టీల నేతలను ఆమె కలుస్తున్నారు. నిన్న ముంబైలో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ను కలిసిన తర్వాత మీడియాతో ఆమె మాట్లాడుతూ చేసిన వ్యాఖ్యలు రాజకీయ దుమారం రేపుతున్నాయి. యూపీఏ (యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయెన్స్) అంటే ఏమిటి? యూపీఏ ఇప్పుడు ఉందా? అంటూ ఆమె ప్రశ్నించారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పార్టీ స్పందించింది.

కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబాల్ మాట్లాడుతూ... కాంగ్రెస్ లేని యూపీఏ ఆత్మ లేని శరీరం వంటిదని అన్నారు. విపక్ష పార్టీలన్నీ ఐకమత్యాన్ని ప్రదర్శించాల్సిన సమయమిదని చెప్పారు.

అన్ని కార్యక్రమాల్లో తృణమూల్ కాంగ్రెస్ ను తాము భాగస్వామిని చేశామని రాజ్యసభలో కాంగ్రెస్ పక్ష నేత మల్లికార్జున ఖర్గే తెలిపారు. విపక్ష పార్టీలు విడిపోకూడదని... ఒకరితో మరొకరు గొడవ పడకూడదని సూచించారు. అందరం కలిసి బీజేపీని ఎదుర్కోవాలని చెప్పారు. విపక్షాలు గొడవపడుతూ ఉంటే బీజేపీని ఎదుర్కోవడం కష్టమవుతుందని అన్నారు.