ఫ్రెషర్స్ పార్టీ కలకలం.. 182 మంది మెడికల్ విద్యార్థులకు కరోనా
- ధార్వాడ్ లోని మెడికల్ కాలేజీలో కలకలం
- కరోనా బారిన పడిన వారిలో అత్యధికులు రెండు డోస్ ల వ్యాక్సిన్ తీసుకున్నవారే
- కొత్త వేరియంటా? అనే అనుమానాలను వ్యక్తం చేస్తున్న వైద్య అధికారులు
ధార్వాడ్ లోని ఎస్డీఎం మెడికల్ కాలేజీలో తొలుత 300 మందికి కరోనా పరీక్షలు చేయించారు. వీరిలో 66 మందికి పాజిటివ్ గా నిర్ధారణ అయింది. తాజాగా మరి కొందరి రిపోర్టులు కూడా వచ్చాయి. మరో 116 మందికి పాజిటివ్ గా తేలింది. దీంతో కరోనా బారిన పడిన విద్యార్థుల సంఖ్య 182కి చేరింది. వీరంతా కూడా ఫ్రెషర్స్ పార్టీలో పాల్గొన్న వారే కావడం గమనార్హం. దీంతో, కాలేజీలో ఆందోళనకర వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ మెడికల్ కాలేజీ కొవిడ్ క్లస్టర్ గా మారిపోయింది.
కాలేజీలో కరోనా కేసులపై జిల్లా ఆరోగ్యశాఖ అధికారులు దృష్టి సారించారు. వైరస్ వేగంగా వ్యాప్తి చెందడటంతో... ఇదేమైనా కొత్త వేరియంటా? అనే అనుమానాన్ని అధికారులు వ్యక్తం చేస్తున్నారు. కరోనా బారిన పడిన విద్యార్థులకు జన్యు పరీక్షలు చేయిస్తామని చెప్పారు. కాలేజీలో ఉన్న దాదాపు 3 వేల మంది విద్యార్థులకు, మొత్తం సిబ్బందికి కరోనా పరీక్షలను నిర్వహిస్తామని తెలిపారు. ఇప్పటి వరకు దాదాపు వెయ్యి మందికి కొవిడ్ పరీక్షలను నిర్వహించారు. వీరిలో మిగిలిన వారి రిపోర్టులు రావాల్సి ఉంది. మరోవైపు కరోనా బారిన పడినవారి ప్రైమరీ, సెకండరీ కాంటాక్టులను గుర్తించే పనిలో అధికారులు నిమగ్నమయ్యారు.