వచ్చే రెండేళ్లలో అన్నీ అరాచకాలే.. అప్రమత్తంగా ఉండండి: పార్టీ నేతలకు చంద్రబాబు దిశానిర్దేశం

02-12-2021 Thu 09:31
  • కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నేతలతో సమావేశం
  • కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన ప్రతి ఒక్కరికి అభినందనలు
  • పార్టీ కోసం కష్టపడి పనిచేసే వారికే అందలం
  • జగన్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందన్న బాబు
Chandrababu directed his party leaders
కృష్ణా జిల్లాలో ఇటీవల మునిసిపల్ ఎన్నికలు జరిగిన కొండపల్లి, జగ్గయ్యపేట పురపాలక సంఘాల నాయకులతో నిన్న పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన టీడీపీ అధినేత చంద్రబాబు.. కొండపల్లిలో పార్టీ విజయానికి కృషి చేసిన వారికి పేరుపేరునా అభినందనలు తెలిపారు. జగ్గయ్యపేటలో టీడీపీదే నైతిక విజయమని పేర్కొన్నారు. వైసీపీ అక్రమాల వల్లే టీడీపీ అక్కడ సాంకేతికంగా ఓటమిపాలైనట్టు చెప్పారు. నియోజకవర్గాల్లో ఇకపై సమర్థులకే అవకాశం కల్పిస్తామన్నారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టి వాటిని ప్రజల్లోకి సమర్థంగా తీసుకెళ్లే నాయకులకే భవిష్యత్తులో పార్టీలో ప్రాధాన్యం ఉంటుందని తేల్చి చెప్పారు.

జగన్‌పై ప్రజల్లో తీవ్రస్థాయిలో వ్యతిరేకత ఉందని చంద్రబాబు అన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మరీ జగన్ స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. నేతలంతా అప్రమత్తంగా ఉండాలని, వచ్చే రెండేళ్లలో అన్నీ అరాచకాలే ఉంటాయని అప్రమత్తం చేశారు. కొండపల్లి ఎన్నికల్లో నాయకులకు చక్కగా దిశానిర్దేశం చేశారని ఎంపీ కేశినేని నానిని ప్రశంసించారు. రాష్ట్రస్థాయి నాయకులు కూడా అలాగే పనిచేస్తే చక్కని ఫలితాలు వస్తాయని చంద్రబాబు పేర్కొన్నారు.