ప్రపంచవ్యాప్తంగా విడుదలైన బాలకృష్ణ ‘అఖండ’.. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ అన్న నటుడు సమీర్

02-12-2021 Thu 09:02
  • అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి
  • బాణసంచా కాలుస్తూ ‘జై బాలయ్య’ అంటూ నినాదాలు
  • కూకట్‌పల్లి భ్రమరాంబ థియేటర్‌‌కు బాలయ్య, దిల్‌రాజు, మిర్యాల రవీంద్ర, తారకరత్న
  • సినిమాపై పాజిటివ్ రివ్యూలు
Balakrishna Akhanda got positive revies
నందమూరి బాలకృష్ణ, బోయపాటి శ్రీను కాంబినేషన్‌లో హ్యాట్రిక్‌ సినిమాగా తెరకెక్కిన అఖండ సినిమా నేడు ప్రపంచవ్యాప్తంగా విడుదలైంది. ఈ సినిమా పోస్టర్లు తొలి నుంచి అభిమానుల్లో అంచనాలను భారీగా పెంచేశాయి. సినిమా విడుదల నేపథ్యంలో అర్ధరాత్రి నుంచే థియేటర్ల వద్ద అభిమానుల సందడి నెలకొంది.  పెద్ద సంఖ్యలో థియేటర్ల వద్దకు చేరుకున్న అభిమానులు బాణసంచా కాల్చారు. జై బాలయ్య అంటూ నినాదాలు చేశారు.

తెల్లవారుజామున నాలుగు గంటల నుంచే హైదరాబాద్ కూకట్‌పల్లిలోని భ్రమరాంభ థియేటర్‌లో బెనిఫిట్ షో వేశారు. సినిమాను వీక్షించేందుకు తారకరత్న, నిర్మాత దిల్‌రాజు, మిర్యాల రవీంద్ర థియేటర్‌కు వచ్చారు. బాలకృష్ణ కూడా థియేటర్‌కు వస్తున్నట్టు తెలుస్తోంది. బాలయ్య ఖాతాలో మరో బ్లాక్‌బస్టర్ పడిందని నటుడు సమీర్ చెప్పారు.

సినిమాపై పాజిటివ్ రివ్యూలు వస్తున్నాయి. బాలకృష్ణ ఈ సినిమాలో విశ్వరూపాన్ని ప్రదర్శించారని చెబుతున్నారు. అఘోరాగా అదరగొట్టేశారని, మాస్ ప్రేక్షకులకు విజువల్ ట్రీట్ ఇచ్చారని అంటున్నారు. సెకండాఫ్‌లో బాలయ్య ఉగ్రరూపం, విలన్ గా శ్రీకాంత్ నటన సినిమాకు హైలైట్ అని అభిమానులు చెబుతున్నారు. జగపతిబాబు నటన ప్రేక్షకులను మెప్పించిందని చెబుతున్నారు.