Ganja: గతేడాది ఏపీలో లక్ష కిలోలకుపైగా గంజాయి దొరికింది: రాజ్యసభలో కేంద్రమంత్రి

  • మూడేళ్లలో మూడింతలు పెరిగిన అక్రమ రవాణా
  • 2020లో 1,06,042.7 కిలోల గంజాయి స్వాధీనం
  • కనకమేడల అడిగిన ప్రశ్నకు మంత్రి సమాధానం
NCB seize over one lakh kilos Ganja in AP in 2020

గతంలో ఎన్నడూ లేనంతగా ఏపీలో ఇటీవల గంజాయి పట్టుబడుతోంది. గంజాయి అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం ఎన్ని కఠిన చర్యలు తీసుకుంటున్నా వీటికి మాత్రం అడ్డుకట్ట పడడం లేదు. గంజాయి అక్రమ రవాణాపై అధికార, ప్రతిపక్షాల మధ్య విమర్శలు, ప్రతివిమర్శలు చోటుచేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కేంద్ర హోంశాఖ సహాయమంత్రి నిత్యానంద రాయ్ రాజ్యసభలో ఈ విషయమై చేసిన ప్రకటన విస్తుపోయేలా చేస్తోంది.

ఆంధ్రప్రదేశ్‌లో దొరికిన గంజాయి పరిమాణం మూడేళ్లలో మూడు రెట్లు పెరిగినట్టు ఆయన రాజ్యసభకు తెలిపారు. టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ అడిగిన ప్రశ్నకు సమాధానంగా ఆయనీ విషయాన్ని వెల్లడించారు.

2018లో 33,930.5 కిలోల గంజాయి ఆధారిత మాదకద్రవ్యాలును స్వాధీనం చేసుకోగా, 2019లో అది రెండింతలై 66,665.5 కిలోలకు పెరిగిందని పేర్కొన్నారు. ఇక, గతేడాది ఇది ఏకంగా మూడు రెట్లు పెరిగిందని పేర్కొన్న మంత్రి.. 1,06,042.7 కిలోలను ఎన్‌డీపీఎస్ చట్టం కింద స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. రాష్ట్రంలో గంజాయి సాగుకు అడ్డుకట్ట వేసేందుకు మాదకద్రవ్యాల నియంత్రణ అధికారులు చర్యలు తీసుకుంటున్నట్టు మంత్రి తెలిపారు.

More Telugu News