కేఎల్ రాహుల్ ను ఇతర ఫ్రాంచైజీలు సంప్రదించి ఉంటే అది నిబంధనల ఉల్లంఘనే: పంజాబ్ కింగ్స్

01-12-2021 Wed 21:34
  • వచ్చే ఐపీఎల్ సీజన్ కోసం త్వరలో వేలం
  • ఐపీఎల్ లో ఈసారి మరో రెండు జట్లు
  • ఆటగాళ్ల వేలంపై సర్వత్రా ఆసక్తి
  • లక్నో ఫ్రాంచైజీ రాహుల్ వైపు చూస్తున్నట్టు ప్రచారం
Punjab Kings opines in KL Rahul issue
వచ్చే సీజన్ నుంచి ఐపీఎల్ లో 10 జట్లు తలపడుతున్న నేపథ్యంలో ఈసారి నిర్వహించే వేలానికి ప్రాధాన్యత ఏర్పడింది. కొత్త జట్లు లక్నో, అహ్మదాబాద్ ఏ ఆటగాళ్లను తీసుకుంటాయన్నది అందరిలోనూ ఆసక్తి కలిగిస్తోంది. అయితే లక్నో జట్టు పంజాబ్ కింగ్స్ సారథి కేఎల్ రాహుల్ తో సంప్రదింపులు జరుపుతోందంటూ వార్తలు వినిపిస్తున్నాయి.

దీనిపై పంజాబ్ కింగ్స్ యాజమాన్యం ఘాటుగా స్పందించింది. ఒకవేళ కేఎల్ రాహుల్ తో ఇతర ఫ్రాంచైజీలు సంప్రదింపులు జరుపుతూ ఉంటే అది కచ్చితంగా నిబంధనల ఉల్లంఘనే అవుతుందని స్పష్టం చేసింది. ఇలాంటి చర్యలు అనైతికమని పేర్కొంది. తాము రాహుల్ ను అట్టిపెట్టుకోవాలని కోరుకుంటున్నానని, కానీ అతడు మాత్రం వేలానికి వెళ్లేందుకు సిద్ధమయ్యాడని పంజాబ్ కింగ్స్ ఫ్రాంచైజీ సహ యజమాని నెస్ వాడియా ఆరోపించారు.

గత రెండు సీజన్లుగా కేఎల్ రాహుల్ కు కెప్టెన్ గా కావాల్సినంత స్వేచ్ఛ ఇచ్చామని తెలిపారు. కేఎల్ రాహుల్ కు లక్నో ఫ్రాంచైజీ గాలం వేస్తోందన్న వార్తలపై స్పందిస్తూ, అలా జరుగుతుందని తాను అనుకోవడంలేదని పేర్కొన్నారు. అది బీసీసీఐ నియమావళికి విరుద్ధమని నెస్ వాడియా స్పష్టం చేశారు.