ఒక పదం తప్పుగా దొర్లిన మాట వాస్తవమే... నారా భువనేశ్వరికి క్షమాపణలు చెబుతున్నా: వల్లభనేని వంశీ సంచలన వ్యాఖ్యలు

01-12-2021 Wed 21:15
  • ఏపీ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామం
  • భువనేశ్వరిపై వ్యాఖ్యల పట్ల వంశీ వివరణ
  • చంద్రబాబుకూ క్షమాపణలు 
  • పశ్చాత్తాపం వ్యక్తం చేసిన వైనం 
Vallabhaneni Vamsi apologizes Nara Bhuvaneswari and Chandrababu
ఏపీ రాజకీయాల్లో అత్యంత ఆసక్తికర పరిణామం చోటుచేసుకుంది. కొంతకాలంగా వైసీపీకి అత్యంత సన్నిహితంగా మెలుగుతున్న టీడీపీ రెబల్ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ తాజాగా సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను నారా భువనేశ్వరిపై పొరబాటున వ్యాఖ్యలు చేశానని, తీవ్ర భావోద్వేగాల నడుమ ఒక మాట తప్పుగా దొర్లిందని అంగీకరించారు. అందుకు తాను పశ్చాత్తాపం వ్యక్తం చేస్తున్నానని, ఆత్మసాక్షిగా క్షమాపణలు తెలుపుకుంటున్నానని వంశీ వెల్లడించారు.

తాను భువనేశ్వరిని అక్కా అని పిలుస్తానని వివరించారు. ఈ వివాదాన్ని ఇంతటితో ముగించాలని, తన నుంచి మరోసారి ఇలాంటి పొరబాటు వ్యాఖ్యలు రావని స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనను క్షమించాలని విజ్ఞప్తి చేశారు. కులం నుంచి వెలివేస్తారన్న కారణంతో తాను క్షమాపణలు చెప్పడం లేదని, ఆత్మ ప్రబోధానుసారం నిర్ణయం తీసుకున్నానని వల్లభనేని వంశీ ఉద్ఘాటించారు.