Raghavendra Rao: ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలు, రేట్ల తగ్గింపుపై అసంతృప్తి వ్యక్తం చేసిన కె.రాఘవేంద్రరావు

Raghavendra Rao opines on online ticketing and tickets rates
  • ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకాలు
  • తాజాగా టికెట్ రేట్ల వివరాలు వెల్లడి
  • ఓ ప్రకటన చేసిన రాఘవేంద్రరావు
  • పలు అంశాలపై అభిప్రాయాలు వెల్లడించిన వైనం
ఏపీలో ఆన్ లైన్ లో సినిమా టికెట్లు విక్రయించాలని ప్రభుత్వం నిర్ణయించడం తెలిసిందే. తాజా టికెట్ల ధరలు కూడా వెల్లడయ్యాయి. గతంతో పోల్చితే సినిమా టికెట్ల రేట్లు బాగా తగ్గినట్టు తెలుస్తోంది. టికెట్ల అంశంపై తాజాగా దర్శకేంద్రుడు కె.రాఘవేంద్రరావు తీవ్రస్థాయిలో స్పందించారు. ఆయన ఓ సుదీర్ఘ ప్రకటన చేశారు. చిత్ర పరిశ్రమలో తనకు 45 ఏళ్ల అనుభవం ఉందని, దర్శకుడిగానూ, నిర్మాతగానూ తన అభిప్రాయాలను అర్థం చేసుకోవాలని స్పష్టం చేశారు.

ప్రస్తుత టికెట్ల విధానంతో చాలామంది తీవ్ర నష్టాలకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. థియేటర్లలో చూస్తే వచ్చే అనుభూతిని ప్రేక్షకుడు టీవీలో ఎప్పటికీ పొందలేడని తెలిపారు. ప్రదర్శనల సంఖ్య తగ్గించడం, టికెట్ల రేట్లు తగ్గించడం వల్ల థియేటర్ల యాజమాన్యాలు, డిస్ట్రిబ్యూటర్లు, నిర్మాతలు నష్టపోతారని వివరించారు.

ఆన్ లైన్ విధానం వల్ల దోపిడీ ఆగిపోతుందనడం సరికాదని రాఘవేంద్రరావు స్పష్టం చేశారు. ప్రేక్షకుడు ఒక మంచి సినిమా చూడదలుచుకుంటే టికెట్ రూ.300 కాదు రూ.500 పెట్టి అయినా చూస్తాడని, అదే అతనికి నచ్చని సినిమాను టికెట్ రూపాయికే ఇచ్చినా చూడడని వివరించారు.

పైగా ఆన్ లైన్ విధానంలో చాలామంది టికెట్లను బ్లాక్ చేసే అవకాశం ఉంటుందని, అదే ఆన్ లైన్ లో రేట్లు పెంచి టికెట్లు అమ్మితే ప్రభుత్వానికి ఎక్కువ ట్యాక్స్ వస్తుందని వెల్లడించారు. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం తగిన న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు.
Raghavendra Rao
Online Tickets
Ticket Rates
Andhra Pradesh
Tollywood

More Telugu News