సిరివెన్నెల కుటుంబానికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుంది: మంత్రి పేర్ని నాని

01-12-2021 Wed 14:20
  • తీవ్ర అనారోగ్యంతో సిరివెన్నెల కన్నుమూత
  • ఫిలించాంబర్ లో భౌతికకాయం
  • నివాళి అర్పించిన ఏపీ మంత్రి పేర్ని నాని
  • తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి అని కితాబు
Perni Nani pays tributes to Sirivennela Sitharamasastri
టాలీవుడ్ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి సినీ ప్రముఖులు, అభిమానులు ఘననివాళులు అర్పిస్తున్నారు. ప్రముఖులు, అభిమానుల సందర్శనార్థం ఆయన భౌతికకాయాన్ని హైదరాబాద్ ఫిలించాంబర్ వద్ద ఉంచిన సంగతి తెలిసిందే. ఏపీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర సమాచార, ప్రసార శాఖ మంత్రి పేర్ని నాని కూడా నివాళి అర్పించారు.

ఈ సందర్భంగా పేర్ని నాని మాట్లాడుతూ, తెలుగు జాతి గర్వించదగ్గ వ్యక్తి సిరివెన్నెల అని కొనియాడారు. ఆయన మృతి అత్యంత విచారకరమని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటున్నామని తెలిపారు. ఏపీ ప్రజల తరఫున సిరివెన్నెల కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలుపుకుంటున్నామని వెల్లడించారు. ఈ సందర్భంగా సిరివెన్నెల కుటుంబ సభ్యులను ఓదార్చిన మంత్రి పేర్ని నాని... వారికి ఏపీ ప్రభుత్వం అండగా ఉంటుందని స్పష్టం చేశారు.