రోడ్డు బాగు చేయాలంటూ మట్టి, కంకర తేలిన రోడ్డుపై యువకుడి పొర్లు దండాలు

01-12-2021 Wed 13:56
  • తెలంగాణలోని తాండూర్ లో ఘటన
  • కొద్ది దూరం మోకాళ్లపై నడక
  • అదుపులోకి తీసుకున్న పోలీసులు
Youth Protested On Damaged Road
రోడ్ల దుస్థితిపై ఓ యువకుడు వినూత్న నిరసన తెలియజేశాడు. రోడ్డంతా గుంతలు పడడం, మట్టి, కంకర తేలి ఉండడం, చాలా రోజుల నుంచి మరమ్మతులు చేయకపోవడంతో.. అదే రోడ్డుపై పొర్లు దండాలు పెడుతూ రోడ్డును బాగు చేయాలని ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేశాడు. ఈ ఘటన తెలంగాణలోని వికారాబాద్ జిల్లా తాండూరులో జరిగింది.

అంతారం గ్రామానికి చెందిన అమ్రేశ్ అనే యువకుడు గ్రామ సమీపంలోని ఎన్టీఆర్ నగర్ కాలనీ నుంచి పాడైన రహదారిపై కొద్ది దూరం మోకాళ్లపై నడిచాడు. అనంతరం పొర్లుదండాలు పెడుతూ నిరసన తెలిపాడు. స్థానికులూ యువకుడికి మద్దతు తెలిపారు.

ఇప్పటికైనా పాలకులు పాడైన రోడ్లను బాగు చేయాలని డిమాండ్ చేశారు. పోలీసులు అక్కడకు చేరుకుని యువకుడిని పోలీస్ స్టేషన్ కు తీసుకెళ్లారు.