కొన్నిసార్లు మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరచడానికి కూడా మాటలు రావు: జూనియర్ ఎన్టీఆర్

01-12-2021 Wed 11:21
  • సిరివెన్నెలకు నివాళి అర్పించిన జూనియర్ ఎన్టీఆర్
  • రాబోయే తరాలకు ఆయన సాహిత్యం బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించిన తారక్
  • తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని వ్యాఖ్య
Junior NTR pays tributes to Sirivennela
సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రికి జూనియర్ ఎన్టీఆర్ నివాళి అర్పించారు. అనంతరం మీడియాతో ఆయన మాట్లాడుతూ... కొన్నిసార్లు మన మనసులో ఉన్నదాన్ని వ్యక్తపరచడానికి కూడా మాటలు రావని అన్నారు. ఇప్పుడు తన మనసులోని ఆవేదనను కూడా ఆ మహానుభావుడు ఆయన కలంతోనే వ్యక్తపరిస్తే బాగుండేదేమోనని చెప్పారు.

సీతారామశాస్త్రిగారి కలం ఆగిపోయినా... ఆయన రాసిన పాటలు, సాహిత్యం, తెలుగు భాష, తెలుగు సాహిత్యం బతికున్నంత కాలం నిలిచే ఉంటాయని అన్నారు. రాబోయే తరాలకు ఆయన సాహిత్యం బంగారు బాటలు వేయాలని ఆకాంక్షించారు. పైనుంచి తెలుగు సాహిత్యం వైపు ఆయన చల్లని చూపు ఎప్పుడూ ఉండాలని అన్నారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని... ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు.