స్కూళ్లు మళ్లీ బంద్ కాబోతున్నాయనే వార్తలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి స్పందన!

01-12-2021 Wed 09:19
  • రోజురోజుకు పెరుగుతున్న ఒమిక్రాన్ భయాలు
  • విద్యా సంస్థలు యథావిధిగా కొనసాగుతాయన్న సబితా ఇంద్రారెడ్డి
  • ముఖ్యమంత్రి కూడా ఇదే విషయాన్ని చెప్పారని వ్యాఖ్య
Telangana eduction minister says schools not going to close amid Omicron fears
కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ ప్రపంచాన్ని వణికిస్తోంది. భారత్ లోకి  కూడా ఈ వైరస్ ప్రవేశించిందన్న వార్తలతో ప్రజలు ఆందోళన చెందుతున్నారు. మరోవైపు ఒమిక్రాన్ నేపథ్యంలో తెలంగాణలో పాఠశాలలు, కాలేజీలు మళ్లీ మూతపడబోతున్నాయనే ప్రచారం పెద్ద ఎత్తున సాగుతోంది. ఈ వార్తలపై తెలంగాణ విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ... సోషల్ మీడియలో జరుగుతున్నది తప్పుడు ప్రచారమేనని అన్నారు. రాష్ట్రంలో విద్యాసంస్థలు యథావిధిగా నడుస్తాయని చెప్పారు.

ఇటీవల జరిగిన కేబినెట్ సమావేశంలో కూడా స్కూళ్లను కొనసాగించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారని తెలిపారు. స్కూళ్లు మూతపడబోతున్నాయనే వార్తలను విద్యార్థులు, తల్లిదండ్రులు నమ్మవద్దని కోరారు. విద్యాసంస్థల యాజమాన్యాలు కొవిడ్ నిబంధనలను, జాగ్రత్తలను పాటించాలని అన్నారు. మాస్కులు ధరించాలని, భౌతికదూరం పాటించాలని సూచించారు.