ఫిలిం చాంబర్‌లో సిరివెన్నెలకు ప్రముఖుల నివాళి

01-12-2021 Wed 09:08
  • ఉదయం పదిన్నర గంటల వరకు ఫిలించాంబర్‌లోనే సిరివెన్నెల భౌతికకాయం
  • 11 గంటలకు మహాప్రస్థానంలో అంత్యక్రియలు
  • కన్నీటి పర్యమంతమైన తనికెళ్ల భరణి
  • సినీ ప్రముఖుల నివాళి
  • కుటుంబ సభ్యులకు ఓదార్పు
Tollywood Celebrities pays tributes to sirivennela seetharama sastry
అనారోగ్యంతో నిన్న కన్నుమూసిన ప్రముఖ సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి భౌతికకాయాన్ని అభిమానుల సందర్శనార్థం ఈ ఉదయం ఫిలింనగర్‌లోని ఫిలిం చాంబర్‌కు తీసుకొచ్చారు. ఉదయం పదిన్నర గంటల వరకు అక్కడే ఉంచి 11 గంటలకు  మహాప్రస్థానంలో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. దర్శకులు త్రివిక్రమ్, రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణి తదితరులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు. ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ నేత మధుయాష్కీ గౌడ్ మాట్లాడుతూ.. సీతారామశాస్త్రి ఆకస్మిక మరణం సినీ రంగానికి, తెలుగు సాహిత్యానికి తీరని లోటని అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. సిరివెన్నెల ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తున్నట్టు చెప్పారు. పాటకు పట్టుచీర కట్టిన మహానుభావుడు సిరివెన్నెల అని, ఆయన ఇంత త్వరగా వెళ్లిపోతారని అనుకోలేదని దర్శకుడు విజయ్ భాస్కర్ అన్నారు. అందరూ తనను సునీల్ అని పిలుస్తారని, కానీ సిరివెన్నెల మాత్రం సునీలా అని పిలిచేవారని, తనను చాలా ఆప్యాయంగా చూసుకున్నారని నటుడు సునీల్ గుర్తు చేసుకున్నారు.

సీతారామశాస్త్రి భౌతిక కాయాన్ని సందర్శించిన సినీ రచయిత, నటుడు తనికెళ్ల భరణి కన్నీటి పర్యంతమయ్యారు.  స్రవంతీ మూవీస్‌లో ఇద్దరం కలిసి పనిచేశామని గుర్తు చేసుకున్నారు. ప్రతి పదాన్ని చెక్కేవాడని, ఆయన పాట వజ్రం పొదిగినట్టు ఉండేదని, ఆయన పాటల ప్రకాశం తెలుగుజాతి ఉన్నంత వరకు ఉంటుందని చెబుతూ తనికెళ్ల భరణి తీవ్ర ఉద్వేగానికి గురయ్యారు.

సరస్వతీ పుత్రుడైన సిరివెన్నెల గురించి మాట్లాడే అర్హత కానీ, అనుభవం కానీ తనకు లేవని నటుడు రావు రమేశ్ అన్నారు. చాలా గొప్పగా తండ్రి పేరు నిలబెడతావన్న ఆయన మాటలు తనలో స్ఫూర్తి నింపాయని పేర్కొన్నారు. అలాగే, నటుడు వెంకటేశ్, సంగీత దర్శకుడు మణిశర్మ, గుణశేఖర్, సునీత, పరుచూరి గోపాలకృష్ణ, స్రవంతి రవికిషోర్, అచ్చిరెడ్డి, ఎస్వీ కృష్ణారెడ్డి, సాయికుమార్, బాలకృష్ణ, అల్లు అర్జున్ తదితరులు సిరివెన్నెల భౌతికకాయానికి నివాళులు అర్పించారు.