CBI: జగన్ అక్రమాస్తుల కేసు.. మొత్తం వ్యవహారాన్ని విడివిడిగా చూస్తే నేరం కనిపించదన్న సీబీఐ

YS Jagan illegal assets case CBI objects Vanpic Petition
  • సీబీఐ కేసులు కొట్టేయాలంటూ వాన్‌పిక్, నిమ్మగడ్డ క్వాష్ పిటిషన్లు
  • విడివిడిగా చూస్తే ఎవరూ తప్పుచేయనట్టే చెబుతారు
  • అన్ని కేసుల్లోనూ జగన్,  విజయసాయిరెడ్డి నిందితులుగా ఉన్నారు
  • ముడుపుల కోసం పలు కంపెనీలు స్థాపించారు
  • రూ. 854 కోట్లు పెట్టుబడి పెట్టి రూ. 17 వేల కోట్ల విలువైన ప్రాజెక్టు అందుకున్నారన్న సీబీఐ
  • తాము పెట్టుబడిగా పెట్టింది రూ. 497 కోట్లేనన్న వాన్‌పిక్ 
జగన్ అక్రమాస్తుల వ్యవహారంలో తమపై నమోదైన కేసును కొట్టివేయాలంటూ వాన్‌పిక్, దాని అధినేత నిమ్మగడ్డ ప్రసాద్ దాఖలు చేసిన పిటిషన్లపై నిన్న తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. జస్టిస్ ఉజ్జల్ భూయాన్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సీబీఐ తరపున కేసును వాదించిన కె.సురేందర్ తన వాదనలు వినిపిస్తూ.. ఈ మొత్తం కేసులో నిందితుల పాత్రను విడివిడిగా చూడరాదని అన్నారు.  ఈ మేరకు ఓ ఉదాహరణ కూడా చెప్పారు. బాంబు తయారీ కోసం ఒక వ్యక్తి డబ్బు సమకూరిస్తే, తాను డబ్బు మాత్రమే ఇచ్చానని ఒకరు, తాను కేవలం కొరియర్‌ను మాత్రమేనని మరొకరు, డబ్బులు ఇవ్వడం వల్లే బాంబు తయారీకి అవసరమైన సామగ్రి కొన్నానని ఇంకొకరు, వారు బాంబు పెట్టమన్నారని చెబితే పెట్టానని మరొకరు.. ఇలా ఎవరికి వారు విడివిడిగా చెబితే తప్పు చేయనట్టేనని అన్నారు.

విడివిడిగా చూస్తే ఎవరికి వారే తమకు సంబంధం లేదని చెబుతారని అన్నారు. ఇలాంటి కుట్రలో అందరి పాత్రను కలిపి చూడాల్సిన అవసరం ఉందన్నారు. అన్ని కేసుల్లోనూ జగన్, విజయసాయిరెడ్డి నిందితులుగా ఉన్నారని అన్నారు. ముడుపులు స్వీకరించడానికే వీరు జగతి పబ్లికేషన్స్, కార్మెల్ ఏసియా, రఘురాం సిమెంట్స్ వంటి సంస్థలను ఏర్పాటు చేశారని ఆరోపించారు.  జగన్ కంపెనీల్లో ముడుపులుగా రూ. 854 కోట్ల పెట్టుబడులు పెట్టడం ద్వారా అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం రూ. 17 వేల కోట్ల విలువైన వాన్‌పిక్ ప్రాజెక్టును కేటాయించిందని కోర్టు దృష్టికి తీసుకెళ్లారు.

అంతకుముందు వాన్‌పిక్ తరపున కోర్టుకు హాజరైన సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. వైఎస్‌తో కలిసి జగన్ కుట్ర పన్నారని చెప్పడానికి ఏ ఒక్క ఆధారమూ లేదని, జరిగిన ఘటనల ద్వారానే కుట్ర పన్నారని చెబుతున్నారని కోర్టుకు తెలిపారు. మంత్రి మండలిని ఓ వ్యక్తి ప్రభావితం చేయబోరన్నారు. నిజానికి ప్రభుత్వం కల్పించిన ప్రయోజనాలన్నీ రస్ ఆల్‌ఖైమా (రాక్)కేనని, తాము ఏజెంటుగా మాత్రమే వ్యవహరించినట్టు చెప్పారు. జగన్ కంపెనీల్లో తాము పెట్టిన పెట్టుబడి రూ. 497 కోట్లు మాత్రమేనని కోర్టుకు తెలిపారు. కాగా, ఈ కేసులో నేడు కూడా హైకోర్టులో విచారణ కొనసాగనుంది.
CBI
YS Jagan
Illegal Assets Case
Vanpic

More Telugu News