Sirivennela: సిరివెన్నెల మృతిపై బాలకృష్ణ, కేటీఆర్, కె.విశ్వనాథ్ స్పందన!

Balakrishna KTR K Vishwanath response on Sirivennela death
  • తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుందన్న బాలకృష్ణ
  • కోట్లాది మంది అభిమానులను సంపాదించుకున్నారన్న కేటీఆర్
  • ఏం చేయాలో అర్థం కావడం లేదన్న కె.విశ్వనాథ్

సినీ పాటల రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మరణం పట్ల సినీ, రాజకీయ ప్రముఖులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. సినీ నటుడు, టీడీపీ ఎమ్మెల్యే బాలకృష్ణ స్పందిస్తూ సినీ పాటకు సాహితీ గౌరవాన్ని కల్పించిన వ్యక్తి సిరివెన్నెల సీతారామశాస్త్రి అని కొనియాడారు. తెలుగు పాటను దశదిశలా వ్యాపింపజేసిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుందని చెప్పారు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతున్ని ప్రార్థిస్తున్నానని తెలిపారు.

తెలంగాణ మంత్రి కేటీఆర్ స్పందిస్తూ... తన పాటల ద్వారా సమాజంలో చైతన్యం నింపిన వ్యక్తి సిరివెన్నెల అని అన్నారు. కోట్లాది మంది అభిమానులను ఆయన సంపాదించుకున్నారని చెప్పారు. ఆయన మరణం సాహితీ లోకానికి తీరని లోటు అని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని... సిరివెన్నెల కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.

కె.విశ్వనాథ్ స్పందిస్తూ సిరివెన్నెల మరణం తనకు వ్యక్తిగతంగా తీరని లోటు అని చెప్పారు. ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం చనిపోయినప్పుడు కుడి భుజాన్ని కోల్పోయినట్టు అనిపించిందని... ఇప్పుడు ఎడమ భుజాన్ని కోల్పోయానని చెప్పారు. ఏం చేయాలో తనకు అర్థం కావడం లేదని తెలిపారు. ఎంతో సన్నిహితంగా ఉన్న వ్యక్తి మనల్ని వదిలి వెళ్లిపోయాడంటే నమ్మశక్యం కావడం లేదని చెప్పారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నానని అన్నారు.

  • Loading...

More Telugu News