ఆయన పాటకు మరణం లేదు: ఎన్టీఆర్

30-11-2021 Tue 21:37
  • సిరివెన్నెల లేరనే మాట వినడానికే కష్టంగా ఉంది
  • అలుపెరగకుండా పాటలు రాసిన కవి ఆయన
  • ఆయన రాసిన అక్షరాలు చెరిగిపోనివి
  • ఆయన ఆత్మకు శాంతి చేకూరాలన్న ఎన్టీఆర్  
Ntr Condolences to Sirivennela
వేటూరి తరువాత తెలుగు పాటల్లో లోతైన సాహిత్యం కనిపించదని అంతా అనుకుంటున్న సమయంలో, తొలి పాటతోనే రచయితగా తన సత్తాను చాటుకుంటూ సిరివెన్నెల దూసుకొచ్చారు. తన పాటల్లో పలుకుబళ్లను .. జాతీయాలను .. మాండలికాలను కలుపుకుంటూ ..  కమనీయంగా నడుపుకుంటూ వెళ్లారు.

తెలుగు ఇండస్ట్రీలో సాహిత్యాన్ని ఇష్టపడేవాళ్లంతా ఆయనకి సన్నిహితులుగా మారిపోయారు. తెలుగు ప్రేక్షకులంతా  ఆయన కలానికి దాసులైపోయారు. అంతా కలిసి పాటల తోటమాలిగా ఆయనకి పట్టం కట్టారు. అలాంటి సిరివెన్నెల మరణం పట్ల ఎన్టీఆర్ ట్విట్టర్ ద్వారా స్పందించాడు.

"సిరివెన్నెల సీతారామశాస్త్రి గారు ఇక లేరు అనే వార్త నన్ను తీవ్రమైన మనస్థాపానికి గురిచేసింది. అలుపెరగక రాసిన ఆయన కలం నేడు ఆగినా, రాసిన అక్షరాలు తెలుగు భాష ఉన్నంత కాలం చిరస్మరణీయంగా ఉంటాయి. ఆయన ఆత్మకి శాంతి చేకూరాలని ఆ దేవుడిని ప్రార్ధిస్తున్నాను" అంటూ ఆయన పట్ల తనకి గల అభిమానాన్ని .. ఆయన మరణం పట్ల ఆవేదనను వ్యక్తం చేశాడు.