సిరివెన్నెల మృతి ప‌ట్ల సీఎం జ‌గ‌న్, చంద్రబాబు దిగ్భ్రాంతి!

30-11-2021 Tue 17:54
  • సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అన్న జగన్
  • సాహితీ లోకానికే తీరని లోటు అన్న చంద్రబాబు
  • ప్రగాఢ సానుభూతిని తెలియజేసిన నేతలు
Jagan and Chandrababu condolences for Sirivennela death
ప్రముఖ సినీ గేయ రచయిత, కవి సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి అందరినీ కలచివేస్తోంది. ఆయన మృతిపట్ల పలువురు ప్రముఖులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఏపీ ముఖ్యమంత్రి జగన్ స్పందిస్తూ.. సినీ గేయ ప్రపంచంలో విలువల శిఖరం సిరివెన్నెల అని కొనియాడారు. అక్షరాలతో ఆయన చేసిన భావ విన్యాసాలు తెలుగువారి చరిత్రలో ఎప్పటికీ నిలిచిపోతాయని అన్నారు. ఆయన హఠాన్మరణం తెలుగువారందరికీ తీరనిలోటు అని చెప్పారు. సిరివెన్నెల సీతారామశాస్త్రి ఆత్మకు శాంతి కలగాలని కోరుకుంటున్నానని... ఆయన కుటుంబసభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని అన్నారు.

టీడీపీ అధినేత చంద్రబాబు స్పందిస్తూ.. అద్భుత సినీ గేయ రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి మృతి వార్త దిగ్భ్రాంతిని కలిగించిందని చెప్పారు. దాదాపు 3 వేలకు పైగా పాటలు రాసి, సంగీత ప్రియులను అలరించిన పద్మశ్రీ సీతారామశాస్త్రి మరణం తెలుగు సాహితీ లోకానికే తీరని లోటు అని అన్నారు. సీతారామశాస్త్రి ఆత్మశాంతికై భగవంతుడిని ప్రార్థిస్తూ వారి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నానని చెప్పారు.