కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు నా అభినందనలు: చిరంజీవి

29-11-2021 Mon 20:57
  • 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ నిర్మించిన నిహారిక
  • ఇటీవల రిలీజైన వెబ్ సిరీస్
  • జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్
  • వెబ్ సిరీస్ వీక్షించిన చిరంజీవి
 Chiranjeevi appreciates Konidela Niharika on her debut production OCFS
మెగా బ్రదర్ నాగబాబు తనయ నిహారిక నిర్మాతగా మారి 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' పేరిట వెబ్ సిరీస్ నిర్మించడం తెలిసిందే. ఇటీవల ఈ వెబ్ సిరీస్ జీ5 ఓటీటీలో విడుదలైంది. 'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' (ఓసీఎఫ్ఎస్)కి ఓటీటీలో మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ వెబ్ సిరీస్ ను మెగాస్టార్ చిరంజీవి కూడా వీక్షించారు. సోషల్ మీడియా వేదికగా తన స్పందన తెలియజేశారు.

'ఒక చిన్న ఫ్యామిలీ స్టోరీ' వెబ్ సిరీస్ చూశానని, ఎంతో వినోదాత్మకంగా ఉందని అభిప్రాయపడ్డారు. ఈ సందర్భంగా కొణిదెల వారి ఆడపడుచు నిహారికకు, ఓసీఎఫ్ఎస్ బృందానికి అభినందనలు అంటూ ఓ ప్రకటన చేశారు. వెబ్ సిరీస్ నిర్మాణంలో తన తొలి ప్రయత్నంలోనే ఇంత హృద్యంగా, జనరంజకంగా తీసి ప్రేక్షకులను మెప్పిస్తోందని కొనియాడారు. ఇదే స్ఫూర్తితో తను మరిన్ని చిత్రాలను నిర్మించాలని కోరుకుంటున్నానని తెలిపారు.