బిగ్ బాస్ షో నుంచి రవి ఎలిమినేషన్ వెనుక కుట్ర ఉందంటున్న బీజేపీ ఎమ్మెల్యే

29-11-2021 Mon 20:40
  • బిగ్ బాస్-5 నుంచి రవి ఎలిమినేషన్
  • మండిపడుతున్న అభిమానులు
  • స్పందించిన బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్
  • అమిత్ షాకు లేఖ రాస్తానని వెల్లడి
  • బిగ్ బాస్ షోను నిషేధించాలంటూ వ్యాఖ్యలు
BJP MLA Raja Singh doubts after Ravi elimination from Bigg Boss show
బిగ్ బాస్-5 రియాల్టీ షో నుంచి యాంకర్ రవి ఎలిమినేట్ అవుతాడని ఎవరూ ఊహించలేదు. ప్రస్తుతం బిగ్ బాస్ ఇంట్లో ఉన్న కంటెసెంట్లతో పోల్చితే యాంకర్ రవి ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా పెద్దది. అయితే, నిన్నటి ఎపిసోడ్ లో రవి ఎలిమినేట్ అయినట్టు ప్రకటించారు. ఇది అభిమానులను తీవ్ర ఆగ్రహానికి గురిచేస్తోంది. ఈ వారం కంటెస్టెంట్లలో ఎవరికి ఎన్ని ఓట్లు వచ్చాయో బయటపెట్టాలని వారు బిగ్ బాస్ నిర్వాహకులను నిలదీస్తున్నారు. మరొకరిని సేవ్ చేసేందుకు రవిని బలి చేస్తారా? అంటూ మండిపడుతున్నారు.

ఈ నేపథ్యంలో బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ కూడా స్పందించారు. రవి ఎలిమినేషన్ పై తమకు అనుమానాలు కలుగుతున్నాయని, దీని వెనుక ఏదైనా కుట్ర జరిగివుంటుందని భావిస్తున్నామని అన్నారు. తెలంగాణకు చెందిన వ్యక్తిని బయటికి పంపించి వేయడం ద్వారా వివాదం సృష్టించాలనుకుంటున్నారా? అని రాజా సింగ్ బిగ్ బాస్ నిర్వాహకులను ప్రశ్నించారు.

దీనిపై తాను కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షాకు లేఖ రాస్తానని, తెలుగు బిగ్ బాస్ షోతో పాటు, హిందీ బిగ్ బాస్ షోను సైతం నిషేధించాలని కోరతానని తెలిపారు. అసలు, బిగ్ బాస్ షోలో ఏంజరుగుతోందో అర్థంకావడం లేదని విస్మయం వ్యక్తం చేశారు.