విమానం టైర్ల వద్ద దాక్కుని 1640 కిమీ ప్రయాణించాడు!

29-11-2021 Mon 18:14
  • గ్వాటెమాలా నుంచి మయామీ వచ్చిన విమానం
  • ల్యాండింగ్ గేర్ నుంచి దిగిన వ్యక్తి
  • దిగ్భ్రాంతికి గురైన సిబ్బంది
  • అదుపులోకి తీసుకుని ఆసుపత్రికి తరలించిన పోలీసులు
Man arrives Miami from Guatemala city sitting in flight landing gear
గ్వాటెమాలా... మెక్సికోను ఆనుకుని ఉండే చిన్నదేశం. దీని రాజధాని గ్వాటెమాలా సిటీ. ఇక్కడ్నించి అమెరికాలోని మయామీ నగరానికి సుమారు 1,640 కిలోమీటర్ల దూరం ఉంటుంది. ఇంతదూరం విమానంలో కూర్చుని ప్రయాణించడం కొద్దిగా కష్టం అనుకుంటే, ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద దాక్కుని గ్వాటెమాలా సిటీ నుంచి మయామీ రావడం దిగ్భ్రాంతి కలిగిస్తోంది.

గత శనివారం మయామీ ఎయిర్ పోర్టులో గ్వాటెమాలా సిటీ నుంచి వచ్చిన ఓ విమానం ల్యాండైంది. ప్రయాణికులు దిగేందుకు సిద్ధమవుతుండగా, ఓ వ్యక్తి విమానం టైర్ల వద్ద నుంచి నడుచుకుంటూ వచ్చాడు. అతడిని చూసి ఎయిర్ పోర్టు సిబ్బంది నివ్వెరపోయారు. అతడిని ప్రశ్నించడంతో అసలు విషయం వెల్లడైంది. గ్వాటెమాలా నుంచి విమానం ల్యాండింగ్ గేర్ లో దాక్కుని వచ్చానని వెల్లడించాడు.

వాస్తవానికి విమానం టేకాఫ్ తీసుకోగానే ల్యాండింగ్ గేర్ లోపలికి మూసుకుపోతుంది. కానీ ఆ వ్యక్తి ఎలాంటి గాయాలు కాకుండా ల్యాండింగ్ గేర్ వద్ద దాక్కుని దాదాపు రెండున్నర గంటలు ప్రయాణించడం పట్ల సిబ్బంది విస్మయానికి గురయ్యారు. కొన్ని అడుగులు వేసిన అతడు నిలుచుకోలేక కూర్చుండిపోయాడు.

అయితే ఎయిర్ పోర్టు సిబ్బంది ఫిర్యాదుతో అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతడి ఆరోగ్య పరిస్థితిని పరిశీలించేందుకు ఆసుపత్రికి తరలించారు. ఆ వ్యక్తిని అక్రమ వలసదారుడిగా భావిస్తున్నారు. దీనికి సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో సందడి చేస్తోంది.