అసెంబ్లీలో చంద్రబాబు సతీమణి ప్రస్తావన ఎక్కడా రాలేదు: తమ్మినేని సీతారాం

29-11-2021 Mon 17:29
  • సభలో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకురావడం సరికాదు
  • ఆయన అలా ఎందుకు చేశారో ఆయనకే తెలియాలి
  • మైక్ ఇవ్వలేదని చంద్రబాబు అనడం దురదృష్టకరం
Nobody spoke about Chandrababu wife says Thammineni Seetharam
శాసనసభ సమావేశాల్లో టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి గురించి ప్రస్తావన ఎక్కడా రాలేదని ఏపీ అసెంబ్లీ స్పీకర్ తమ్మినేని సీతారాం అన్నారు. కానీ చంద్రబాబు అలా ఎందుకు చేశారో ఆయనకు మాత్రమే తెలియాలని చెప్పారు. సభలో వ్యక్తిగత వ్యవహారాలను తీసుకురావడం సరికాదని అన్నారు. సభలో మాట్లాడేందుకు తాను అందరికీ సమాన అవకాశాలను ఇస్తున్నానని చెప్పారు. తనకు మైక్ ఇవ్వలేదని చంద్రబాబు చెప్పడం దురదృష్టకరమని అన్నారు.

తన భార్య ప్రస్తావనను వైసీపీ సభ్యులు తీసుకొచ్చారంటూ చంద్రబాబు కంటతడి పెట్టిన సంగతి తెలిసిందే. ఈ ఘటన దేశ వ్యాప్తంగా చర్చనీయాంశమయింది. టీడీపీ శ్రేణులు ఆందోళనలు కూడా చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే తమ్మినేని పైవ్యాఖ్యలు చేశారు. తమ్మినేని వ్యాఖ్యలపై టీడీపీ నేతలు ఎలా స్పందిస్తారో వేచి చూడాలి.