Draw: వెలుతురు లేమితో గట్టెక్కిన న్యూజిలాండ్... ఒక్క వికెట్ తీసుంటే భారత్ గెలిచేది!

  • కాన్పూర్ టెస్ట్ డ్రా
  • విజయానికి వికెట్ దూరంలో నిలిచిన భారత్
  • న్యూజిలాండ్ కు కలిసొచ్చిన వెలుతురు లేమి
  • కివీస్ టార్గెట్ 184 రన్స్
  • రెండో ఇన్నింగ్స్ లో 165/9
  • జడేజాకు 4, అశ్విన్ కు 3 వికెట్లు
Kanpur test ended as a draw between Team India and New Zealand

కాన్పూర్ లో టీమిండియా, న్యూజిలాండ్ మధ్య తొలి టెస్టు డ్రాగా ముగిసింది. టీమిండియా ఒక్క వికెట్ తీస్తే విజయం సాధిస్తుందన్న తరుణంలో వెలుతురు లేమి ప్రతిబంధకంగా మారింది. ఓటమి అంచుల్లో నిలిచిన న్యూజిలాండ్ కు అదే వరంలా మారింది. మ్యాచ్ జరిగే వీల్లేకపోవడంతో అంపైర్లు ఆట నిలిపివేశారు.

మ్యాచ్ ముగిసే సమయానికి న్యూజిలాండ్ స్కోరు 9 వికెట్లకు 165 పరుగులు. రచిన్ రవీంద్ర 18, అజాజ్ పటేల్ 2 పరుగులతో నాటౌట్ గా మిగిలారు. టీమిండియా బౌలర్లలో రవీంద్ర జడేజా 4, అశ్విన్ 3 వికెట్లు తీశారు. అక్షర్ పటేల్ 1, ఉమేశ్ యాదవ్ 1 వికెట్ పడగొట్టారు.

న్యూజిలాండ్ ఇన్నింగ్స్ లో ఓపెనర్ టామ్ లాథమ్ 52 పరుగులు చేయగా, వన్ డౌన్ లో వచ్చిన విలియం సోమర్ విల్లే 36, కెప్టెన్ కేన్ విలియమ్సన్ 24 పరుగులు చేశారు. ఆఖర్లో రచిన్ రవీంద్ర భారత్ విజయానికి అడ్డుపడ్డాడు. 91 బంతులు ఆడిన రవీంద్ర 18 పరుగులే చేసినా, మరో వికెట్ పడకుండా ఆడి తమ జట్టును ఓటమి నుంచి కాపాడాడు. మరోవైపు టెయిలెండర్ అజాజ్ పటేల్ 23 బంతులు కాచుకుని 2 పరుగులు చేశాడు.

ఆఖర్లో ఫీల్డర్లందరూ బ్యాట్స్ మన్ చుట్టూ మోహరించి ఒత్తిడి పెంచేందుకు ప్రయత్నించినా, వెలుతురు లేమి టీమిండియాపైనే ఒత్తిడి కలిగించింది. దాంతో చివరి ఓవర్లలో అక్షర్ పటేల్, రవీంద్ర జడేజా హడావిడిగా బంతులేయాల్సి వచ్చింది. మరోవైపు అంపైర్లు చీటికిమాటికి మీటర్లతో లైటింగ్ చెక్ చేస్తూ ఉన్న కొద్ది సమయాన్ని కరిగించారు.

ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 345 పరుగులు చేసింది. అనంతరం న్యూజిలాండ్ 296 పరుగులు చేసింది. కీలక ఆధిక్యం పొందిన భారత్ రెండో ఇన్నింగ్స్ ను 234/7 వద్ద డిక్లేర్ చేసింది. దాంతో కివీస్ విజయలక్ష్యం 284 పరుగులు కాగా, ఆ జట్టు డ్రా కోసమే అన్నట్టుగా రక్షణాత్మక ధోరణిలో ఆడింది. చివరికి ఒక్క వికెట్ తేడాతో డ్రా చేసుకుని ఊపిరి పీల్చుకుంది.

ఇక ఇరుజట్ల మధ్య రెండో టెస్టు డిసెంబరు 3 నుంచి 7 వరకు ముంబయి వాంఖెడే స్టేడియంలో జరగనుంది.

More Telugu News