షేన్ వార్న్ కు ప్రమాదం.. ఆసుపత్రిలో చికిత్స!

29-11-2021 Mon 14:41
  • మెల్ బోర్న్ లో షేన్ వార్న్ కు రోడ్డు ప్రమాదం
  • కుమారుడితో కలిసి బైక్ పై వెళ్తుండగా యాక్సిడెంట్
  • నొప్పి తీవ్రంగా ఉందన్న వార్న్
Shane Warne met with accident
స్పిన్ దిగ్గజం, ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వార్న్ రోడ్డు ప్రమాదానికి గురయ్యాడు. ఈ ప్రమాదంలో ఆయన పాదానికి తీవ్ర గాయమయినట్టు సమాచారం. నిన్న ఈ ఘటన చోటుచేసుకోగా... ఈరోజు ఆసుపత్రిలో చేర్పించారు. 300 కిలోల బరువున్న బైకుపై తన కుమారుడు జాక్సన్ తో కలిసి మెల్ బోర్న్ లో ప్రయాణిస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. అయితే గాయం చిన్నదే అని భావించిన షేన్ వార్న్ ఆసుపత్రికి వెళ్లలేదు. కానీ, ఉదయం నిద్రలేచే సమయానికి నొప్పి ఎక్కువయింది. దీంతో, ఆయన ఆసుపత్రికి వెళ్లారు. తనకు గాయమయిందని, నొప్పి తీవ్రంగా ఉందని వార్న్ తెలిపాడు.
 
మరోవైపు వచ్చే నెల 8 నుంచి బ్రిస్బేన్ లో యాషెస్ సిరీస్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్ లో షేన్ వార్న్ కామెంటరీ చెప్పాల్సి ఉంది. అప్పటిలోపల ఆయన కోలుకుంటారని భావిస్తున్నారు. మరోవైపు కరోనా ఒమిక్రాన్ వేరియంట్ బయటపడటంతో ఈ సిరీస్ షెడ్యూల్ ప్రకారం కొనసాగుతుందా? అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి.