Lok Sabha: కొత్త‌ సాగు చ‌ట్టాల ర‌ద్దుకు లోక్‌స‌భ‌ ఆమోదం

  • మూజువాణి ఓటుతో ఆమోదం
  • చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌ని కేంద్రం
  • చ‌ర్చించాల‌ని ప‌ట్టుబ‌ట్టిన విప‌క్షాలు
  • ఆందోళ‌న‌ల మ‌ధ్యే బిల్లు ప్ర‌వేశ‌పెట్టిన తోమ‌ర్
lok shabha passes farm laws repeal bill

కేంద్ర ప్ర‌భుత్వం తీసుకొచ్చిన కొత్త సాగు చ‌ట్టాల ర‌ద్దుకు మూజువాణి ఓటుతో లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. మూడు సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లును ఈ రోజు వ్య‌వ‌సాయ శాఖ మంత్రి తోమర్ ప్ర‌వేశ‌పెట్టారు. విప‌క్షాల ఆందోళ‌న మ‌ధ్యే ఈ ప్ర‌క్రియ కొన‌సాగింది. బిల్లు ర‌ద్దుపై చ‌ర్చ చేప‌ట్టాల‌ని విప‌క్ష పార్టీల స‌భ్యులు డిమాండ్ చేశారు.

అయితే, విప‌క్షాల డిమాండ్‌ను స్పీక‌ర్ ఓం బిర్లా తిర‌స్క‌రించారు. మూజువాణి ఓటుతో సాగు చ‌ట్టాల ర‌ద్దుకు లోక్‌స‌భ ఆమోదం తెలిపింది. అనంత‌రం స‌భ‌ను ఈ రోజు మ‌ధ్యాహ్నం 2 గంట‌ల వ‌ర‌కు వాయిదా వేస్తున్న‌ట్లు ఓం బిర్లా ప్ర‌క‌టించారు.

కాగా, కొత్త వ్యవసాయ చట్టాల రద్దు ప్రక్రియలో భాగంగా ఐదు రోజుల క్రితం ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగిన కేంద్ర మంత్రివర్గ సమావేశంలో ఆ చట్టాల రద్దుకు ఆమోదం తెలిపిన విష‌యం తెలిసిందే. ఆ వ్యవసాయ చట్టాలను వ్యతిరేకిస్తూ దేశ వ్యాప్తంగా రైతులు పెద్ద ఎత్తున నిర‌స‌న తెలిపారు.  

ఢిల్లీ సరిహద్దుల్లో ఆందోళ‌న‌లు కొన‌సాగిస్తూనే ఉన్నారు. అయితే, ఎమ్మెస్పీకి చట్టబద్ధత క‌ల్పించే అంశం కూడా రైతుల ప్రధాన డిమాండ్ లో ఉంది. దీనిపై మాత్రం కేంద్ర ప్ర‌భుత్వం స‌మాధానం ఇవ్వ‌లేదు. మ‌రోవైపు పార్ల‌మెంటు స‌మావేశాల్లో కేంద్ర స‌ర్కారు మొత్తం 25 బిల్లులు ప్ర‌వేశ‌పెట్ట‌నుంది.

పెగాసస్ వ్యవహారం, ధరల పెరుగుదల వంటి అంశాల‌పై కేంద్ర స‌ర్కారుని నిల‌దీసేందుకు విప‌క్షాలు సిద్ధంగా ఉన్నాయి. సాగు చ‌ట్టాల ర‌ద్దు బిల్లుపై చ‌ర్చ‌కు అవ‌కాశం ఇవ్వ‌కుండా లోక్‌స‌భలో దాన్ని ఆమోదింప‌జేసుకుంది కేంద్ర స‌ర్కారు. పార్ల‌మెంటు ఆవ‌ర‌ణ‌లో విప‌క్ష పార్టీల నేత‌లు నిర‌స‌న తెలుపుతున్నారు.

More Telugu News