Women: 11 రాష్ట్రాల్లోని మహిళలు ఆ విషయం గురించి ఎవరికీ చెప్పుకోవడం లేదట: సర్వేలో తేలిన నిజం

  • తమపై జరుగుతున్నశారీరక హింసను మౌనంగానే భరిస్తున్న మహిళలు
  • బయటకు చెప్పి సాయాన్ని అర్థించేది 10 శాతం లోపే
  • ఏపీ, తెలంగాణలోనూ అదే పరిస్థితి
  • జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వేలో వెల్లడి
Over 70 percent women in 11 states never told anyone about violence experienced by them

జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే (ఎన్ఎఫ్‌హెచ్ఎస్)లో వెలుగు చూసిన ఓ విషయం అందరినీ విస్తుపోయేలా చేస్తోంది. దేశంలోని 11 రాష్ట్రాలు, ఒక కేంద్ర పాలిత ప్రాంతంలోని 70 శాతానికిపైగా మహిళలు తమపై జరుగుతున్న హింసను మౌనంగా భరిస్తున్నారు తప్పితే, ఎవరికీ చెప్పుకోవడం లేదని, ఎవరి సాయమూ కోరడం లేదని తేలింది.

హింసకు గురవుతున్నా ఎవరికీ చెప్పుకోకుండా తమలో తామే కుమిలిపోతున్న మహిళల సంఖ్య అస్సాంలో 81.2 శాతం ఉంటే బీహార్‌లో 81.8 శాతం, మణిపూర్‌లో 83.9 శాతం, సిక్కింలో 80.1 శాతం, జమ్మూకశ్మీర్‌లో 83.9 శాతం ఉన్నట్టు సర్వేలో వెలుగుచూసింది.

70 శాతానికిపైగా ఉన్న రాష్ట్రాల్లో ఏపీ (79.7 శాతం), తెలంగాణ (71 శాతం), త్రిపుర (76 శాతం), పశ్చిమ బెంగాల్ (76.3 శాతం), మహారాష్ట్ర (76.4 శాతం), గోవా (75.7 శాతం), గుజరాత్ (70.6 శాతం) ఉన్నాయి.

తాము ఎదుర్కొంటున్నశారీరక హింస నుంచి బయటపడేందుకు సాయాన్ని అర్థించిన మహిళల సంఖ్య 10 శాతం లోపే ఉండడం గమనార్హం. అస్సాంలో 6.6 శాతం మంది మహిళలు సాయాన్ని అర్థిస్తే, ఏపీలో 7.7, బీహార్‌లో 8.9, గోవాలో 9.6, హిమాచల్ ప్రదేశ్‌లో 9.6, జమ్మూకశ్మీర్‌లో 7.1, మణిపూర్‌లో 1.2, నాగాలాండ్‌లో 4.8 శాతం మంది మహిళలు సాయం కోరారు.

మహిళలు ఎదుర్కొంటున్న హింసలో శరీరంపై కోతలు, నొప్పులు, కంటిగాయాలు, ఎముకలు విరగడం, తీవ్రమైన కాలిన గాయాలు, విరిగిన పళ్లు, ఎముకల స్థానభ్రంశం వంటివి ఉన్నాయని ఎన్ఎఫ్‌హెచ్ఎస్ వెల్లడించింది.

More Telugu News