South Africa: దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన వ్యక్తికి కరోనా.. అది ఒమిక్రానేనా?

South Africa returnee tests positive for Covid in Thane
  • ఈ నెల 24న దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి
  • బాధితుడిని ఐసోలేషన్ చేసిన కేడీఎంసీ అధికారులు
  • జినోమ్ సీక్వెన్సింగ్ కోసం నమూనాలు
దక్షిణాఫ్రికా నుంచి స్వదేశానికి చేరుకుంటున్న వారిలో పలువురు కొవిడ్ బాధితులుగా తేలుతున్నారు. సౌతాఫ్రికా నుంచి శనివారం బెంగళూరు చేరుకున్న ఇద్దరు వ్యక్తులకు కరోనా సోకినట్టు నిర్ధారణ కాగా, తాజాగా మహరాష్ట్రలోని పూణెలో మరో కేసు బయటపడింది. డొంబివ్లీకి చెందిన ఓ వ్యక్తి దక్షిణాఫ్రికా నుంచి రాగా, అతడికి నిర్వహించిన పరీక్షల్లో కరోనా సోకినట్టు తేలింది. దీంతో అతడికి సోకింది కొత్తగా బయటపడిన ఒమిక్రాన్ వేరియంట్ అయి ఉంటుందన్న అనుమానంతో నమూనాలను జినోమ్ సీక్వెన్సింగ్ కోసం పంపించారు. బాధితుడిని కల్యాణ్-డోంబివ్లీ మునిసిపల్ కార్పొరేషన్ (కేడీఎంసీ)లోని ఆర్ట్ గ్యాలరీలో ఐసోలేషన్ చేశారు.

దక్షిణాఫ్రికా నుంచి వచ్చిన బాధితుడు ఈ నెల 24న ఢిల్లీ చేరుకున్నాడు. అక్కడి నుంచి ముంబైకి వచ్చాడు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగానే ఉందని కేడీఎంసీ ఆరోగ్య అధికారి డాక్టర్ ప్రతిభా పన్‌పాటిల్ తెలిపారు. బాధితుడి సోదరుడికి మాత్రం కరోనా నెగటివ్ అని తేలిందన్నారు. అతడి కుటుంబ సభ్యులకు నేడు పరీక్షలు నిర్వహిస్తామన్నారు. కాగా, బెంగళూరులో వెలుగు చూసిన రెండు కేసులు ఒమిక్రాన్ కాదని తేలడంతో అధికారులు ఊపిరి పీల్చుకున్నారు.
South Africa
Omicron
COVID19
Thane

More Telugu News