వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం చక్కర్లు.. యూపీలో టెట్ రద్దు

29-11-2021 Mon 06:57
  • నెల రోజుల తర్వాత మళ్లీ పరీక్ష
  • 23 మంది అనుమానితుల అరెస్ట్
  • బ్లాక్‌లిస్టులో ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీ
  • జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగిస్తామన్న యూపీ సీఎం
UPTET 2021 Cancelled After Question Paper Leaked on WhatsApp
ఉత్తరప్రదేశ్‌లో నిన్న నిర్వహించాల్సిన ఉపాధ్యాయ నియామక అర్హత పరీక్ష ‘టెట్’ రద్దయింది. ఈ పరీక్షకు సంబంధించిన ప్రశ్న పత్రం మథుర, ఘజియాబాద్, బులంద్‌షహర్ ప్రాంతాల్లోని వాట్సాప్ గ్రూపుల్లో చక్కర్లు కొట్టడమే ఇందుకు కారణం. రద్దు చేసిన పరీక్షను నెల రోజుల తర్వాత నిర్వహిస్తామని ప్రభుత్వం తెలిపింది. మరోవైపు, పేపర్ లీకేజీ ఘటనకు సంబంధించి లక్నో, మీరట్, వారణాసి, గోరఖ్‌పూర్ తదితర ప్రాంతాల్లో 23 మంది అనుమానితులను అరెస్ట్ చేశారు.

ప్రశ్నపత్రం నిర్వహణ ఏజెన్సీని అధికారులు బ్లాక్‌లిస్ట్‌లో పెట్టారు. పేపర్ లీకేజీకి పాల్పడిన వారిని ఉపేక్షించబోమని యూపీ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. వారిపై గ్యాంగ్‌స్టర్ చట్టం కింద కేసులు నమోదు చేయడంతోపాటు జాతీయ భద్రతా చట్టాన్ని ప్రయోగించి వారి ఆస్తులను జప్తు చేస్తారని తెలిపారు.