Axar Patel: న్యూజిలాండ్‌ను కుప్పకూల్చడం వెనకున్న టెక్నిక్‌ను బయటపెట్టిన అక్షర్ పటేల్

Axar Patel Revealed the secret behind his five wicket haul
  • బంతితో అక్షర్ పటేల్ మాయాజాలం
  • ఐదుసార్లు ఒకే ఇన్నింగ్స్‌లో ఐదు వికెట్లు
  • ప్రపంచ రికార్డు బద్దలు
  • బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్ చేయడం వల్లే వికెట్లు వచ్చాయన్న అక్షర్
కాన్పూరు టెస్టులో టీమిండియా స్పిన్నర్ అక్షర్ పటేల్ మాయాజాలం ప్రదర్శించాడు. అతడు విసిరే బంతులకు విలవిల్లాడిన కివీస్ 296 పరుగులకే ఆలౌటైంది. న్యూజిలాండ్ తొలి ఇన్నింగ్స్ తొలి రోజు భారత బౌలర్లకు కొరకరాని కొయ్యగా మారిన బ్యాటర్లు నిన్న విలవిల్లాడారు. ముఖ్యంగా అక్షర్ పటేల్, అశ్విన్ బంతులను ఎదురొడ్డలేక వికెట్లు సమర్పించుకున్నారు.

అక్షర్ ఐదోసారి ఒకే ఇన్నింగ్స్ ఐదు వికెట్లు సాధించి అత్యంత వేగంగా ఆ ఘనత సాధించిన తొలి బౌలర్‌గా రికార్డులకెక్కాడు. మ్యాచ్ అనంతరం అక్షర్ పటేల్ మాట్లాడుతూ.. నిజానికి ఇది డ్రీమ్ స్టార్ట్ అని పేర్కొన్నాడు. టెస్టు క్రికెట్ అంత సులభం కాదన్నాడు. ఈ రోజు చాలా కష్టమైన రోజని అన్నాడు. తొలి రోజు వారు ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా మూడో రోజు ఆట ప్రారంభించారని పేర్కొన్నాడు. అప్పటికే ఓపెనర్లు క్రీజులో పాతుకుపోవడంతో ప్రతి బంతికి వికెట్ తీయాలని భావించలేదని, ఓపిగ్గా వ్యవహరించామని చెప్పుకొచ్చాడు.

తానైతే బేసిక్స్‌కు కట్టుబడి బౌలింగ్ చేశానని, ఈ క్రమంలో క్రీజును కూడా తనకు అనుకూలంగా మార్చుకోవడం ద్వారా వికెట్లు సాధించగలిగానని అక్షర్ వివరించాడు. రౌండ్ ఆర్మ్ డెలివరీలు సంధించడం బాగా పనికొచ్చిందన్న పటేల్.. ట్రాక్ క్రమంగా నెమ్మదిస్తుండడంతో బంతి మరింతగా తిరిగిందన్నాడు. అయితే, బ్యాటర్లు కనుక క్రీజులో కుదురుకుంటే పరుగులు వస్తాయన్న విషయాన్ని మాత్రం తాను నమ్ముతున్నట్టు చెప్పాడు.
Axar Patel
Team India
Team New Zealand
Kanpur Test

More Telugu News