గుజరాత్ తీరానికి సమీపంలో ఢీకొన్న విదేశీ వాణిజ్య నౌకలు.. తప్పిన ప్రాణనష్టం!

28-11-2021 Sun 09:42
  • గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద ఘటన
  • ప్రమాద సమయంలో నౌకల్లో 44 మంది సిబ్బంది
  • పరిస్థితిని సమీక్షిస్తున్న ఇండియన్ కోస్ట్ గార్డు అధికారులు
2 foreign cargo ships collide in Gulf of Kutch
గుజరాత్ తీరానికి సమీపంలో రెండు భారీ వాణిజ్య నౌకలు ఢీకొన్నాయి. తీరానికి సమీపంలోని గల్ఫ్ ఆఫ్ కచ్ వద్ద శుక్రవారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్టు భారత తీర రక్షకదళం (ఐసీజీ) అధికారులు తెలిపారు. ప్రమాద సమయంలో రెండు నౌకల్లో కలిపి 44 మంది ఉన్నారు. అయితే, ప్రాణనష్టానికి సంబంధించి ఎలాంటి సమాచారం లేదు.

ఢీకొన్న రెండు నౌకల్లో ఒకటి చమురు/రసాయనాలను మోసుకెళ్తున్న ట్యాంకర్ ఎంవీ అట్లాంటిక్ గ్రేస్. దీని పొడవు 183 మీటర్లు. ఇది హాంకాంగ్ జెండాతో ప్రయాణిస్తుండగా, రెండోది ఎంవీ ఏవియేటర్. ఇది మార్షల్ ఐలాండ్స్ ఫ్లాగ్‌తో ప్రయాణిస్తోంది. దీని పొడవు 140 మీటర్లు.

ఎంవీ అట్లాంటిక్ గ్రేస్ కాండ్లా రేవు నుంచి యూఏఈలోని ఫుజైరా వెళ్తుండగా, ఎంవీ ఏవియేటర్ కాండ్లా రేవుకు వస్తోంది. ప్రమాదం జరిగిన వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఐసీజీ నౌకలు, హెలికాప్టర్ పరిస్థితిని సమీక్షిస్తున్నాయి.