చాతీ నొప్పితో ఆసుపత్రిలో చేరిన మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి

28-11-2021 Sun 09:07
  • అభివృద్ది పనులను పర్యవేక్షిస్తూ బిజీగా గడిపిన ఆళ్ల
  • సాయంత్రం ఇంటికెళ్లే సందర్భంలో చాతీలో నొప్పి
  • విశ్రాంతి అవసరమన్న వైద్యులు
Mangalagiri MLA Alla Ramakrishna Reddy joins Hospital
గుంటూరు జిల్లా మంగళగిరి వైసీపీ ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి అస్వస్థతతో ఆసుపత్రిలో చేరారు. చాతీ నొప్పిగా ఉండడంతో పరీక్షల కోసం గుంటూరులోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. పరీక్షించిన వైద్యుల సూచన మేరకు ఆసుపత్రిలో చేరారు. ఆయన ఆరోగ్యం నిలకడగానే ఉందని, విశ్రాంతి అవసరమని వైద్యులు తెలిపారు.

ఎమ్మెల్యే నిన్న మంగళగిరి-తాడేపల్లి పరిధిలోని పలు అభివృద్ధి పనులను పర్యవేక్షిస్తూ బిజీగా గడిపారు. నరసింహస్వామి ఆలయంలో జరిగిన కార్యక్రమాల్లోనూ పాల్గొన్నారు. సాయంత్రం పెదకాకానిలోని తన నివాసానికి బయలుదేరారు. ఈ క్రమంలో చాతీలో నొప్పి రావడంతో చూపించుకునేందుకు నగరంలోని సాయిభాస్కర్ ఆసుపత్రికి వెళ్లారు. అక్కడ ఆయనకు పరీక్షలు నిర్వహించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించడంతో ఆసుపత్రిలో చేరారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్యులు తెలిపారు.