China: నోయిడా ఎయిర్‌పోర్టు ఇదేనంటూ చైనా విమానాశ్రయ ఫొటోలు షేర్ చేసిన బీజేపీ నేతలు.. అది ‘బీజింగ్ జనతా పార్టీ’ అంటూ కాంగ్రెస్ నిప్పులు

  • బీజింగ్‌లోని డాగ్జింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఫొటోలను షేర్ చేసిన కేంద్రమంత్రులు
  • దుమ్మెత్తి పోస్తున్న కాంగ్రెస్
  • చైనాకు లొంగిపోయి మన భూభాగాన్ని అప్పగించేస్తోందని ఆరోపణ
  • బీజేపీ రంగు బయటపడిందన్న చైనా మీడియా
Chinese media calls out BJP ministers and leaders for tweeting Beijing airport image

జెవార్‌లో నిర్మించ తలపెట్టిన నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయానికి ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ నెల 25న శంకుస్థాపన చేయడానికి ముందు బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలు తీవ్ర విమర్శలకు కారణమవుతున్నాయి. నోయిడాలో నిర్మించబోతున్న ఈ విమానాశ్రయం ఆసియాలోనే అతిపెద్దదని, దీని ద్వారా ఈ ప్రాంతానికి రూ. 35 వేల కోట్ల పెట్టుబడులు రావడంతోపాటు లక్షమందికి ఉపాధి అవకాశాలు లభిస్తాయంటూ  కేంద్ర మంత్రులు అనురాగ్‌ ఠాకూర్‌, ప్రహ్లాద్‌ సింగ్‌ పాటిల్‌, అర్జున్‌ రామ్‌ మేఘవాల్‌, ఉత్తరప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కేశవ్‌ ప్రసాద్‌ మౌర్య తదితరులు బీజింగ్‌లోని డాగ్జింగ్ అంతర్జాతీయ విమానాశ్రయ ఫొటోలను షేర్ చేశారు.

ఈ ఫొటోలు బీజింగ్ విమానాశ్రయానివని తేలడంతో కాంగ్రెస్ నేతలు విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ ఎంపీ, రాజ్యసభలో ప్రతిపక్ష నేత అయిన మల్లికార్జున ఖర్గే బీజేపీపై తీవ్రస్థాయిలో దుమ్మెత్తిపోశారు. అది బీజేపీ కాదని, ‘బీజింగ్ జనతా పార్టీ’ అని విమర్శిస్తూ ట్వీట్ చేశారు. అరుణాచల్‌ ప్రదేశ్‌లో గ్రామాలు నిర్మించుకోవడానికి అక్కడి బీజేపీ ప్రభుత్వం అనుమతి ఇస్తుంటే, ఉత్తరప్రదేశ్‌లోని బీజేపీ ప్రభుత్వం చైనా విమానాశ్రయాన్ని తనదిగా చూపిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చైనాకు లొంగిపోయిన ప్రభుత్వం లడఖ్‌లో మన భూభాగాన్ని ఆ దేశానికి అప్పగిస్తోందని ఆరోపించారు.

మరోవైపు, బీజేపీ నేతలు షేర్ చేసిన ఫొటోలపై చైనా ప్రభుత్వ మీడియా గ్లోబల్ టెలివిజన్ కూడా స్పందించింది. బీజేపీ నేతల దుష్ప్రచారం మరోమారు బయటపడిందని విమర్శించింది. వారు షేర్ చేసిన ఫొటోలు బీజింగ్‌లోని డాగ్జింగ్ అంతర్జాతీయ ఫొటోలని స్పష్టం చేసింది.

More Telugu News