ఈనాటి అనుబంధం ఏనాటిదో!: అల్లు అర్జున్

27-11-2021 Sat 22:29
  • అఖండ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్టుగా బన్నీ
  • అఖండ పెద్ద హిట్ అవ్వాలని ఆకాంక్ష
  • బాలయ్య డైలాగులు చెప్పే విధానంపై ప్రశంసలు
Allu Arjun attends Akhanda pre release event
టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అఖండ చిత్రం ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, నందమూరి బాలకృష్ణ కుటుంబంతో తమ కుటుంబానికి ఎంతో అనుబంధం ఉందని వెల్లడించారు. ఈనాటి అనుబంధం ఏనాటిదో అని వ్యాఖ్యానించారు. ఎన్టీఆర్ తో తన తాత గారు అల్లు రామలింగయ్యకు ఎంతో సాన్నిహిత్యం ఉండేదని, ఎన్టీఆర్ గారి కిచెన్ లోకి అల్లు రామలింగయ్య గారు నేరుగా వెళ్లిపోయేవారని వివరించారు. తన తండ్రి అల్లు అరవింద్, బాలకృష్ణ ఒక తరం వ్యక్తులని, తాను చిరంజీవి, బాలకృష్ణ సినిమాలు చూస్తూ పెరిగానని తెలిపారు.

ఇక దర్శకుడు బోయపాటి గురించి చెబుతూ, బోయపాటి తనను ఎంతో గౌరవిస్తారని, తాను ఎదగడాన్ని ఆయన ఎంతో ఇష్టపడతారని వివరించారు. ఈ చిత్రం ద్వారా హీరోయిన్ ప్రగ్యా జైస్వాల్ కు మరింత బూస్ట్ రావాలని అభిలషించారు. శ్రీకాంత్ తమకు ఎంతో ఇష్టమైన వ్యక్తి అని, ఆయన మనసు ఎంతో సున్నితం అని, అలాంటి వ్యక్తి ఎలా విలనిజం చేస్తాడో అని ఆశ్చర్యపోయానని, నిజంగా విస్మయానికి గురిచేసేలా విలన్ పాత్ర పోషించారని బన్నీ కొనియాడారు.

చివరిగా బాలకృష్ణ గురించి చెబుతూ, ఆయన డైలాగులు చెప్పే విధానం తనను అచ్చెరువొందిస్తుందని, ఒక పేజీ అయినా, రెండు పేజీలు అయినా, మూడు పేజీలు అయినా ఒకే తీవ్రతతో డైలాగులు చెప్పడం బాలయ్యలా అందరికీ సాధ్యం కాదని అన్నారు. వ్యక్తిగతంగా బాలయ్యలో ఓ అంశం తనను విపరీతంగా ఆకట్టుకుంటుందని చెప్పారు. చుట్టూ ఉన్న వ్యక్తులు, పరిస్థితులతో సంబంధం లేకుండా తన ప్రపంచంలో తాను ఆనందంగా ఉండడం బాలయ్య ప్రత్యేకత అని కితాబిచ్చారు. అఖండ చిత్రం భారీ హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్టు వెల్లడించారు. చివరగా జై బాలయ్యా అంటూ ప్రసంగం ముగించారు.