ఒకే వేదికపై పక్కపక్కనే కోమటిరెడ్డి, రేవంత్ రెడ్డి... ఫొటో ఇదిగో!

27-11-2021 Sat 20:21
  • రెండ్రోజుల వరి దీక్ష చేపట్టిన తెలంగాణ కాంగ్రెస్
  • ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ శ్రేణుల దీక్ష
  • హాజరైన కాంగ్రెస్ అగ్రనేతలు
  • ఉల్లాసంగా మాట్లాడుకుంటూ కనిపించిన రేవంత్, కోమటిరెడ్డి
Komati Reddy and Revanth Reddy talk to each other at Vari Deeksha
ధాన్యం కొనుగోలు అంశం ప్రధాన అజెండాగా తెలంగాణ కాంగ్రెస్ రెండ్రోజుల పాటు వరి దీక్షకు సిద్ధమైంది. హైదరాబాదులోని ధర్నా చౌక్ వద్ద కాంగ్రెస్ అగ్రనేతలు, పార్టీ శ్రేణులు బైఠాయించాయి. ఈ సందర్భంగా ఎవరూ ఊహించని దృశ్యం కనువిందు చేసింది. నిన్నటిదాకా ఎడమొహం పెడమొహంలా ఉన్న ఎంపీ కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి... నేడు ధర్నా వేదికపై పక్కపక్కనే కూర్చుని అందరినీ ఆశ్చర్యానికి గురిచేశారు. అంతేకాదు, వారిద్దరూ ఎంతో హాయిగా నవ్వుతూ మాట్లాడుకోవడం అందరినీ ఆకట్టుకుంది. వారితోపాటు వీహెచ్, ఉత్తమ్ కుమార్ వంటి అగ్రనేతలు కూడా నవ్వులు పంచుకున్నారు. దీనికి సంబంధించిన ఫొటో సామాజిక మాధ్యమాల్లో అందరినీ ఆకర్షిస్తోంది.

తెలంగాణ కాంగ్రెస్ చీఫ్ గా రేవంత్ రెడ్డి బాధ్యతలు అందుకున్నాక కోమటిరెడ్డి పార్టీ కార్యకలాపాలకు కొద్దిమేర దూరం పాటించారు. తన పంథాలో తాను కొనసాగారు. టీపీసీసీ చీఫ్ పదవిని ఆశించిన ఆయన... అది దక్కకపోయే సరికి అసంతృప్తికి గురయ్యారంటూ ప్రచారం జరిగింది.