'లక్ష్య' సినిమా నాగశౌర్యను గట్టెక్కిస్తుందా?

27-11-2021 Sat 18:35
  • నాగశౌర్య నుంచి 'లక్ష్య'
  • విలువిద్య నేపథ్యంలో కథ
  • కీలకమైన పాత్రలో జగపతిబాబు
  • వచ్చేనెల 10వ తేదిన విడుదల  
Lakshya movie upadate
నాగశౌర్యకి లవర్ బాయ్ గా మంచి క్రేజ్ ఉంది. అయితే ఆ ఇమేజ్ నుంచి బయటపడటానికి ఆయన ఎప్పటికప్పుడు ప్రయత్నం చేస్తూనే ఉన్నాడు. కథలోను .. తన లుక్  విషయంలోనూ ఎప్పటికప్పుడు కొత్తదనాన్ని చూపించడానికి తనవంతు ప్రయత్నం చేస్తున్నాడు. కానీ కాలం కలిసి రావడం లేదు. ముఖం చాటేసిన సక్సెస్ ముందుకు రావడం లేదు.

'నర్తనశాల' .. 'అశ్వద్ధామ' సినిమాలు పరాజయంపాలు కావడంతో, ఆయన 'వరుడు కావలెను' సినిమాపై భారీగానే ఆశలు పెట్టుకున్నాడు. కానీ ఆ సినిమా కూడా ఆయనకి నిరాశనే మిగిల్చింది. పాటలు బాగుండటంతో ఈ సినిమా తప్పకుండా హిట్ అవుతుందని అంతా అనుకున్నారు .. కానీ అలా జరగలేదు.

ఇక ప్రస్తుతం ఆయన చేతిలో 'లక్ష్య' .. 'ఫలానావారి అబ్బాయి ఫలానావారి అమ్మాయి' .. 'పోలీస్ వారి హెచ్చరిక' మొదలైన సినిమాలు ఉన్నాయి. వీటిలో వచ్చేనెల 10వ తేదీన 'లక్ష్య' సినిమా రానుంది. విలువిద్య నేపథ్యంలో వస్తున్న ఈ సినిమాలో కేతిక శర్మ  కథానాయికగా అలరించనుంది. కీలకమైన పాత్రలో జగపతిబాబు కనిపించనున్నాడు. ఈ సినిమాతోనైనా నాగశౌర్యకి హిట్ పడుతుందేమో చూడాలి.