తమిళనాడులో వర్ష బీభత్సం... 8 మంది మృతి

27-11-2021 Sat 18:13
  • ఉపరితల ఆవర్తనంతో విస్తారంగా వర్షాలు
  • తమిళనాడులో అనేక జిల్లాల్లో రెడ్ అలర్ట్
  • ఇవాళ ఒక్కరోజే ఐదుగురి మృతి
  • ఈ నెల 29న అండమాన్ సముద్రంలో అల్పపీడనం
Rains batters Tamilnadu
కొమరిన్ ప్రాంతం, దానికి ఆనుకుని ఉన్న శ్రీలంక తీరంపై ఉపరితల ఆవర్తనం కొనసాగుతోంది. దీని ప్రభావంతో తమిళనాడు, పుదుచ్చేరి, కారైక్కల్ ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. తమిళనాడులో వర్ష బీభత్సం కారణంగా మరణించిన వారి సంఖ్య 8కి పెరిగింది. ఈ మేరకు రాష్ట్ర విపత్తుల నిర్వహణ మంత్రి కేఎస్ఎస్ఆర్ రామచంద్రన్ వెల్లడించారు.

నిన్న ముగ్గురు మరణించగా, నేడు మరో ఐదుగురు భారీ వర్షాల కారణంగా ప్రాణాలు కోల్పోయారని తెలిపారు. తమిళనాడులోని పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ (ఐఎండీ) రెడ్ అలర్ట్ జారీ చేసింది. ఆయా జిల్లాల్లో పాఠశాలలకు సెలవు ప్రకటించారు.

కాగా, దక్షిణ అండమాన్ సముద్రంలో సోమవారం (నవంబరు 29) నాడు అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని ఐఎండీ వెల్లడించింది. తదుపరి 48 గంటల్లో  క్రమంగా బలపడి వాయుగుండంగా మారుతుందని, పశ్చిమ వాయవ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. దీని ప్రభావం ఏపీపై ఏమాత్రం ఉంటుందన్నది ఇంకా తెలియరాలేదు.