'మా' సభ్యుల సంక్షేమం దిశగా కీలక చర్యలు తీసుకున్నాం: మంచు విష్ణు

27-11-2021 Sat 16:42
  • సభ్యుల సంక్షేమమే పరమావధి అని వెల్లడి
  • పలు ఆసుపత్రులతో ఒప్పందం
  • విస్తృత స్థాయిలో సేవలు లభిస్తాయన్న విష్ణు
  • డాక్టర్లకు కృతజ్ఞతలు తెలుపుతూ ప్రకటన
Manchu Vishnu says MAA work on progress
మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్ (మా) సభ్యుల సంక్షేమమే తమకు పరమావధి అని 'మా' అధ్యక్షుడు మంచు విష్ణు మరోసారి స్పష్టం చేశారు. 'మా' సభ్యుల ఆరోగ్యం, వైద్య చికిత్సల కోసం తాము పని ప్రారంభించామని, హైదరాబాదు నగరంలోని ప్రముఖ ఆసుపత్రులతో ఒప్పందం కుదుర్చుకున్నామని వెల్లడించారు. ఆయా ఆసుపత్రుల సౌజన్యంతో ఉచితంగా మెడికల్ క్యాంపులు నిర్వహిస్తామని, బిల్లుల్లో రాయితీలు లభిస్తాయని వివరించారు.

ప్రతి ఆసుపత్రిలోనూ ప్రతి ఒక్క 'మా' సభ్యుడి పేరిట ప్రత్యేక ఫైల్ ఏర్పాటు చేస్తారని, ఆ ఫైల్ లో సదరు సభ్యుడి ఆరోగ్య వివరాలు అన్నీ ఉంటాయని మంచు విష్ణు తెలిపారు. మహిళా సభ్యులు రొమ్ము క్యాన్సర్లు, గర్భాశయ క్యాన్సర్ల చికిత్సలు కూడా పొందవచ్చని పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో తాను డాక్టర్ నాగేశ్వర రెడ్డి (ఏఐజీ), డాక్టర్ భాస్కర్ రావు (కిమ్స్), శ్రీమతి సంగీత (అపోలో), డాక్టర్ సుబ్రమణియమ్ (అపోలో సీఈఓ), డాక్టర్ గురవారెడ్డి (సన్ షైన్ హాస్పిటల్స్), డాక్టర్ అనిల్ కృష్ణ (మెడికవర్) లకు కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని విష్ణు వెల్లడించారు. ఇక, టెనెట్ డయాగ్నస్టిక్స్ లో 50 శాతం రాయితీతో వైద్య పరీక్షల సదుపాయం అందుబాటులోకి వచ్చిందని వివరించారు. ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేశారు.