ఓ ట్వీట్ ను త్రివిక్రమ్ చేశాడని భావించిన పేర్ని నాని... వివరణ ఇచ్చిన సితార ఎంటర్టయిన్ మెంట్స్

27-11-2021 Sat 15:51
  • ఏపీలో సినిమా టికెట్ల ఆన్ లైన్ విధానం
  • సోషల్ మీడియాలో త్రివిక్రమ్ పేరిట కొన్ని వ్యాఖ్యలు 
  • అవి త్రివిక్రమ్ చేసినవి కావన్న సితార ఎంటర్టయిన్ మెంట్స్
  • త్రివిక్రమ్ కు సోషల్ మీడియా ఖాతాలు లేవని వెల్లడి
Sithara Entertainments explains Trivikram tweets issue
ఇటీవల ఏపీ ప్రభుత్వం ఆన్ లైన్ లో సినిమా టికెట్ల అమ్మకంపై అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడం తెలిసిందే. అయితే, దీనిపై దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ స్పందించినట్టుగా ఆయన పేరిట ఓ ట్వీట్ తెరపైకి వచ్చింది. ఆ ట్వీట్ ను త్రివిక్రమే చేశారని భావించిన ఏపీ మంత్రి పేర్ని నాని తన ప్రెస్ మీట్ లో దానిపై స్పందించారు అంతేకాదు, త్రివిక్రమ్ చేసిన ట్వీట్ ను సీఎంకు నివేదిస్తానని వెల్లడించారు.

అయితే, ఆ ట్వీట్ త్రివిక్రమ్ చేసింది కాదని సితార ఎంటర్టయిన్ మెంట్స్ చిత్ర నిర్మాణ సంస్థ వెల్లడించింది. దర్శకుడు త్రివిక్రమ్ కు సోషల్ మీడియాలో ఖాతాలు లేవని తెలిపింది. ఆయన ఏదైనా ప్రకటనలు చేయాల్సి వస్తే హారిక అండ్ హాసిని క్రియేషన్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ చిత్ర నిర్మాణ సంస్థల ద్వారానే స్పందిస్తారని సితార సంస్థ స్పష్టం చేసింది. త్రివిక్రమ్ పేరుతోనూ, ఆయన ఫొటోతోనూ ఉన్న ప్రొఫైల్స్ నుంచి ఎలాంటి వ్యాఖ్యలు వచ్చినా నమ్మవద్దని పేర్కొంది.