అది డ్రామా అని నేను అనుకోవ‌ట్లేదు: చంద్రబాబు కన్నీరుపై ఉండ‌వ‌ల్లి వ్యాఖ్య‌లు

27-11-2021 Sat 14:30
  • సానుభూతి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తే అవి స‌ఫ‌లంకావు
  • ఈ విష‌యం చంద్ర‌బాబుకు కూడా తెలుసు
  • విపక్ష నేతలను మంత్రులు గౌరవించాలి
  • ప్ర‌తిప‌క్ష పార్టీల స‌ల‌హాలు తీసుకోవాలి
Undavalli Arun Kumar Press Meet
ఆంధ్ర‌ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి జ‌గ‌న్‌పై మాజీ ఎంపీ ఉండ‌వ‌ల్లి అరుణ్ కుమార్ తీవ్ర విమ‌ర్శ‌లు గుప్పించారు. ఈ రోజు రాజ‌మ‌హేంద్రవ‌రంలో ఆయ‌న మీడియాతో మాట్లాడుతూ.. పాలనలో సీఎం జ‌గ‌న్ విఫ‌ల‌మ‌య్యార‌ని చెప్పారు. ఆయ‌న మ‌రీ ఇంత‌గా విఫ‌ల‌మ‌వుతార‌ని అనుకోలేద‌ని అన్నారు.

రెండేళ్ల‌లోనే వైసీపీ స‌ర్కారు రూ.3.50 లక్షల కోట్ల అప్పులు చేసింద‌ని అన్నారు. స‌ర్కారుకి అప్పుల‌పై నియంత్ర‌ణ లేకుండాపోయింద‌ని ఆయ‌న చెప్పారు. మ‌రోవైపు మూడు రాజ‌ధానుల బిల్లును ఉప‌సంహ‌రించుకుంటామ‌ని చెప్ప‌డం, మ‌ళ్లీ కొత్త‌ బిల్లు పెడ‌తామ‌ని అన‌డం కూడా స‌ర్కారు వైఫ‌ల్య‌మేన‌ని ఆయ‌న విమ‌ర్శించారు. ప్ర‌తిప‌క్ష పార్టీల స‌ల‌హాలు తీసుకుంటేనే ప్ర‌భుత్వానికి పేరు వ‌స్తుంద‌ని అన్నారు.

అసెంబ్లీలో ప్ర‌తిప‌క్ష పార్టీ స‌భ్యులు లేక‌పోతే ప్రజాస్వామ్యం కూడా లేన‌ట్లేన‌ని ఆయ‌న అన్నారు. రాష్ట్రంలో ప్ర‌తిప‌క్షాన్ని లేకుండా చేయాల‌నుకుంటే అంత‌కంటే అవివేకం మ‌రొక‌టి ఉండ‌బోద‌ని ఆయ‌న చెప్పారు.

ఎన్టీఆర్‌ కుమార్తెల గురించి తాను ఎప్పుడూ ఎలాంటి పుకార్లు వినలేదని ఉండ‌వ‌ల్లి చెప్పారు. త‌న‌కు హరికృష్ణ, పురందేశ్వరితోనూ పరిచయం ఉందని, వారిద్ద‌రు చాలా మంచివారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు కన్నీళ్లు పెట్టుకోవ‌డాన్ని తాను డ్రామా అని అనుకోవడం లేదని చెప్పారు. అయితే సానుభూతి కోసం ప్ర‌య‌త్నాలు చేస్తే అవేం ప‌నిచేయ‌బోవ‌ని చంద్ర‌బాబుకు కూడా తెలుస‌ని ఆయ‌న అన్నారు.  

ఏడ్చినంత మాత్రాన సానుభూతి వస్తుందని తాను అనుకోవడం లేదని చెప్పారు. మానసికంగా దెబ్బతిన్న వారే అసెంబ్లీలో అనుచిత వ్యాఖ్య‌ల‌తో కామెంట్స్ చేస్తున్నారని ఆయ‌న విమర్శించారు. విపక్ష నేతలను, ఇత‌ర మనుషులను వైసీపీ మంత్రులు గౌరవించాలని ఆయ‌న అన్నారు.

మ‌ళ్లీ సీఎంగానే అసెంబ్లీలో అడుగు పెడ‌తాన‌ని చంద్ర‌బాబు నాయుడు అన్నార‌ని ఆయ‌న గుర్తు చేశారు. అయితే, సీఎం అయ్యాక రాష్ట్రానికి ఏం చేస్తారో చెప్పాల‌ని ఆయ‌న అన్నారు. ఏపీ అప్పుల్లో కూరుకుపోతుంటే చేసేది ఏముంటుంద‌ని ఆయ‌న ప్ర‌శ్నించారు. త‌న అభిమానుల‌కు బీపీ పెరిగింది కాబ‌ట్టే ఇటీవ‌ల అభిమానులు, మ‌ద్ద‌తుదారులు టీడీపీ కార్యాల‌యాల‌పై దాడులు చేశారంటూ సీఎం జ‌గ‌న్ అన‌డం స‌రికాద‌ని ఉండ‌వ‌ల్లి చెప్పారు.