కేసీఆర్ కుటుంబంలో కొట్లాట మొదలైంది: బండి సంజయ్

27-11-2021 Sat 13:07
  • కేసీఆర్ అవినీతి పాలనను ప్రజలు సహించలేకపోతున్నారు
  • ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారు
  • కేసీఆర్ పతనం ప్రారంభమయింది
Fighting started in KCR family says Bandi Sanjay
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఢిల్లీ పర్యటనకు వెళ్లొచ్చిన సంగతి తెలిసిందే. ఈ పర్యటనపై తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ విమర్శలు గుప్పించారు. కేసీఆర్ అవినీతి, నియంత పాలనను తెలంగాణ ప్రజలు సహించలేకపోతున్నారని ఆయన అన్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక ఫలితం దీన్నే సూచిస్తోందని చెప్పారు. ప్రజల దృష్టిని మరల్చేందుకే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లారని తెలిపారు. ప్రజలు ఛీత్కరిస్తున్నా పట్టించుకోకుండా... బీజేపీని బద్నాం చేసేందుకు కేసీఆర్ ప్రయత్నిస్తున్నారని దుయ్యబట్టారు.

తెలంగాణకు మంచి రోజులు రాబోతున్నాయని ఓ జ్యోతిష్కుడు తనకు చెప్పాడని బండి సంజయ్ అన్నారు. కేసీఆర్ పతనం ప్రారంభమయిందని చెప్పారు. కేసీఆర్ కుటుంబంలో కూడా కొట్లాట మొదలయిందని అన్నారు. నన్ను సీఎం ఎప్పుడు చేస్తావంటూ కేసీఆర్ పై ఆయన కుటుంబసభ్యులు ఒత్తిడి తీసుకొస్తున్నారని చెప్పారు. బీజేపీ కోసం రక్తం ధారపోసేందుకు కార్యకర్తలు సిద్ధం కావాలని అన్నారు.