కొడాలి నాని, వల్లభనేని వంశీలపై టీడీపీ నేత యరపతినేని తీవ్ర వ్యాఖ్యలు

27-11-2021 Sat 11:59
  • నాని, వంశీ వంటి వారి మాటలను వారి ఇంట్లోని ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారు
  • అలాంటి మాటలు మేము కూడా మాట్లాడగలం
  • వైసీపీని జనాలు పాతిపెట్టే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి
Yarapathineni Srinivas fires on Kodali Nani Vallabhaneni Vamsi
వైసీపీ, టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం ముదురుతోంది. తాజాగా వైసీపీ నేతలపై టీడీపీ సీనియర్ నేత యరపతినేని శ్రీనివాసరావు తీవ్ర వ్యాఖ్యలు చేశారు. తాజాగా ఆయన మాట్లాడుతూ... కొడాలి నాని, వల్లభనేని వంశీ, అంబటి రాంబాబు, ద్వారంపూడి వంటి వారిని వారి ఇంట్లోని ఆడవాళ్లు కూడా అసహ్యించుకుంటున్నారని అన్నారు. వైసీపీ నాయకుల మాదిరి తాము కూడా మాట్లాడగలమని... అయితే మా ఇంట్లో ఆడవాళ్లు ఒప్పుకోరని చెప్పారు.

చంద్రబాబు సెక్యూరిటీ వదిలేసి వస్తే మేమేంటో చూపిస్తామంటూ కొడాలి నాని చేసిన వ్యాఖ్యలపై యరపతినేని మాట్లాడుతూ... కొడాలి నాని ఏం చేస్తాడు? కొడాలి నాని పెద్ద మగాడా? అని ప్రశ్నించారు. జనాలు వైసీపీని పాతిపెట్టే రోజులు దగ్గరలోనే ఉన్నాయని... ఆ పార్టీకి ఘోరీ కట్టడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని చెప్పారు. రేపు అనేది ఒకటి ఉంటుందనే విషయాన్ని వైసీపీ నేతలు మర్చిపోయినట్టున్నారని అన్నారు.

టీడీపీ కార్యకర్తలంతా పట్టుదలగా పని చేసి వైసీపీని పెకిలిస్తామని చెప్పారు. పల్నాడు ప్రాతంలో వైసీపీ నేతల ఆగడాలు పెరుగుతున్నాయని అన్నారు. గత రెండున్నరేళ్లలో 80 మందికి పైగా టీడీపీ కార్యకర్తలపై దాడులు చేశారని, ఏడుగురిని చంపేశారని చెప్పారు. రాష్ట్రంలో నియంత అరాచక పాలన కొనసాగుతోందని అన్నారు.