టెస్టు మ్యాచుకు వ‌చ్చి గుట్కా తిన్నాడు.. ఇప్పుడు తినొద్ద‌ని చెబుతున్నాడు.. మ‌రిన్ని ఫొటోలు వైర‌ల్

27-11-2021 Sat 11:31
  • మొన్న గుట్కా తిన్న ఓ యువ‌కుడు
  • అత‌డి ప‌క్క‌నే అమ్మాయి
  • నేడు ప్ల‌కార్డు ప‌ట్టుకుని సందేశం
  • గుట్కా తిన‌డం త‌ప్ప‌ని చెప్పిన వైనం
Gutka Guy Is Back With A Hilarious Message
భారత్-న్యూజిలాండ్ తొలి టెస్టు మ్యాచుకు వ‌చ్చిన‌ ఓ జంట ఫొటో, వీడియో విప‌రీతంగా వైర‌ల్ అవుతోన్న విష‌యం తెలిసిందే. యువ‌కుడు నోటి నిండా గుట్కా వేసుకుని తింటుండ‌గా, ప‌క్క‌నే కూర్చున్న అమ్మాయి అత‌డిని అదే ప‌నిగా చూసింది. అక్క‌డి స్క్రీన్‌లో ఈ దృశ్యాలు క‌న‌ప‌డ్డాయి. కాన్పూరులోని గ్రీన్‌పార్క్ స్టేడియంలో క‌న‌ప‌డిన ఈ దృశ్యం వైర‌ల్ కావ‌డంతో సోష‌ల్ మీడియాలో మీమ్స్ బాగా వైర‌ల్ అయ్యాయి. దీంతో ఆ యువ‌కుడికి బుద్ధి వ‌చ్చిందేమో!

ఇప్పుడు ఓ సందేశంతో నెటిజ‌న్ల ముందుకు వ‌చ్చాడు. గుట్కా తినకూడ‌ద‌ని సందేశం ఇస్తున్నాడు. చేతిలో ప్ల‌కార్డు ప‌ట్టుకుని గుట్కా తిన‌డం త‌ప్పుడు ప‌ని అని అత‌డు మెసేజ్ ఇస్తూ ఫొటో దిగి పోస్ట్ చేశాడు. కాన్పూర్ గుట్కా బాయ్ పేరుతో అత‌డి కొత్త ఫొటోను నెటిజ‌న్లు షేర్ చేస్తున్నారు.

గుట్కా తింటే తిన్నాడు కానీ, త‌ప్పు తెలుసుకుని మంచి సందేశం ఇచ్చాడ‌ని పేర్కొంటున్నారు. పాన్ మ‌సాలా ప్ర‌క‌ట‌నల్లో న‌టిస్తోన్న సినీన‌టులు కూడా ఇత‌డిని చూసి నేర్చుకోవాల‌ని, బుద్ధి తెచ్చుకోవాల‌ని నెటిజ‌న్లు సూచ‌న‌లు చేస్తున్నారు. గుట్కా బాయ్ మొన్న ఒక‌లా, ఇప్పుడు మ‌రొక‌లా వ్య‌వ‌హ‌రిస్తోన్న తీరుపై అనుమానాలూ వ్య‌క్తం చేస్తున్నారు. చేసిందంతా చేసి, గుట్కాకు ఫ్రీ ప‌బ్లిసిటీ ఇచ్చి ఇప్పుడు నీతులు చెబుతున్నాడ‌ని మ‌రి కొంద‌రు ఆగ్ర‌హం వ్య‌క్తం చేస్తున్నారు.

మ‌రోవైపు, గుట్కా బాయ్‌ని అనుక‌రిస్తూ కొంద‌రు వీడియోలు తీసి పోస్ట్ చేస్తున్నారు. గుట్కా బాయ్‌పై మీమ్స్ ఇప్ప‌టికీ ఆగ‌ట్లేదు. కొన్ని టీవీ చానెళ్లు అత‌డి ఇంట‌ర్వ్యూలు తీసుకుంటుండ‌డం గ‌మ‌నార్హం. అత‌డికి కొందరు గుట్కా కింగ్ అని పేరు పెట్టారు.