విజయవాడ చేరుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబు.. జగన్‌ను కలిసే అవకాశం!

27-11-2021 Sat 11:12
  • యార్లగడ్డ కుటుంబాన్ని పరామర్శించనున్న మోహన్‌బాబు
  • చాలా రోజుల తర్వాత విజయవాడ వచ్చినందుకు ఆనందంగా ఉందన్న నటుడు
  • జగన్‌తో భేటీ అయితే ఆన్‌లైన్ టికెట్ల విక్రయంపై చర్చించే అవకాశం
tollywood actor mohanbabu visits vijayawada
కృష్ణా జిల్లా పర్యటన నిమిత్తం గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న టాలీవుడ్ సీనియర్ నటుడు మోహన్‌బాబుకు అభిమానులు ఘనంగా స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డితో భేటీ అవుతారని తెలుస్తున్నప్పటికీ ఈ విషయంలో స్పష్టత లేదు. మోహన్‌బాబు కూడా ఈ విషయాన్ని ఎక్కడా పేర్కొనలేదు.

ఏపీ అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీప్రసాద్ తల్లి రంగనాయకమ్మ ఇటీవల మృతి చెందిన నేపథ్యంలో ఆయన కుటుంబాన్ని పరామర్శించేందుకే మోహన్‌బాబు వచ్చినట్టు చెబుతున్నారు. కాగా, చాలా కాలం తర్వాత ఆత్మీయులను కలుసుకునేందుకు విజయవాడ రావడం ఆనందంగా ఉందని నటుడు చెప్పుకొచ్చారు.  

మరోవైపు, మోహన్‌బాబుకు జగన్ కీలక పదవి ఇవ్వబోతున్నట్టు కూడా గత కొంతకాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆయన విజయవాడ రావడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఒకవేళ జగన్‌తో కనుక మోహన్‌బాబు భేటీ అయితే సినిమా టికెట్ల ఆన్‌లైన్ విక్రయంపై చర్చించే అవకాశం ఉందని చెబుతున్నారు.