KS Nageshwar Rao: ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి.. షాక్ లో టాలీవుడ్!

Tollywood director KS Nageshwar Rao passes away
  • ఫిట్స్ వచ్చి మృతి చెందిన కేఎస్ నాగేశ్వరరావు
  • దిగ్భ్రాంతికి గురైన టాలీవుడ్
  • ఆయన అత్తగారి ఊరిలో జరగనున్న అంత్యక్రియలు
తెలుగు సినీ పరిశ్రమలో విషాదం నెలకొంది. ప్రముఖ సినీ దర్శకుడు కేఎస్ నాగేశ్వరరావు మృతి చెందారు. ఫిట్స్ కారణంగా ఆయన మరణించారు. నాగేశ్వరరావుకు భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు.

నిన్న తన సొంత ఊరు నుంచి హైదరాబాదుకు వస్తుండగా కోదాడ సమీపంలో ఆయనకు ఫిట్స్ వచ్చాయి. దీన్ని గమనించిన స్థానికులు ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయనను అక్కడ మరో రెండు, మూడు ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. చివరకు ఏలూరు ఆసుపత్రిలో చేర్పించినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ఆయన అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు ప్రకటించారు. ఆయన మృతి పట్ల టాలీవుడ్ దిగ్భ్రాంతికి గురయింది. సినీ ప్రముఖులు ఆయన మృతి పట్ల సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఆయన కుటుంబానికి సానుభూతిని తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం కేఎస్ రామారావు పార్థివదేహాన్ని ఆయన అత్తగారి ఊరైన నల్లజర్ల సమీపంలో ఉండే కౌలూరులో ఉంచారు. అక్కడే ఆయన అంత్యక్రియలను నిర్వహించనున్నారు. అంత్యక్రియలకు కావాల్సిన ఏర్పాట్లు జరుగుతున్నాయి.

1986 నుంచి ఆయన సినీ పరిశ్రమలో ఉన్నారు. దర్శక దిగ్గజాలలో ఒకరైన కోడి రామకృష్ణ వద్ద అసిస్టెంట్ గా ఆయన కెరీర్ ను ప్రారంభించారు. 'రిక్షా రుద్రయ్య' సినిమాతో ఆయన దర్శకుడిగా మారారు. దివంగత శ్రీహరిని హీరోగా పరిచయం చేస్తూ 'పోలీస్' సినిమాను తెరకెక్కించారు. తాజాగా తన కుమారుడిని పరిచయం చేస్తూ నిర్మాత చదలవాడ శ్రీనివాసరావుతో కలిసి ఒక సినిమా ప్లాన్ చేశారు. కొన్నాళ్లుగా ఆగిపోయిన ఈ సినిమాను మళ్లీ పట్టాలెక్కించాలనుకునే సమయంలోనే ఆయన మృతి చెందడం అందరినీ కలచివేస్తోంది.
KS Nageshwar Rao
Tollywood
Directror
Dead

More Telugu News