Sounds: కుప్పం నియోజకవర్గంలో వింత శబ్దాలు... హడలిపోయిన ప్రజలు

  • రామకుప్పం మండలంలో భారీ శబ్దాలు
  • ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీసిన ప్రజలు
  • శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తింపు
  • బెంగళూరులోనూ వింత శబ్దాలు
Huge sounds in Kuppam constituency

చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గంలో ప్రజలు వింత శబ్దాలతో హడలిపోయారు. ముఖ్యంగా రామకుప్పం మండలంలోని పలు గ్రామాల ప్రజలు వింత శబ్దాలతో ఉలిక్కిపడ్డారు. ఇళ్లలోంచి బయటకు వచ్చి పరుగులు తీశారు. ఈ శబ్దాలు భూమిలోంచి వస్తున్నట్టు గుర్తించారు. గడ్డూరు, దేసినాయనపల్లి, చిన్న గెరెగెపల్లి, పెద్ద గెరెగెపల్లి, యానాది కాలనీల్లో ఈ శబ్దాలు వినిపించాయి.

కాగా, భారీ శబ్దాలు వస్తూనే ఉండడంతో ప్రజలు మళ్లీ ఇళ్లలోకి వెళ్లేందుకు భయపడ్డారు. వారికి రామకుప్పంలోని ప్రభుత్వ పాఠశాలల్లో ఆశ్రయం కల్పించారు.

అటు, కర్ణాటక రాజధాని బెంగళూరు నగరంలోనూ వింత శబ్దాలతో ప్రజలు భయకంపితులయ్యారు. బెంగళూరులో గతంలోనూ వింత శబ్దాలు వినవచ్చాయి. అయితే అప్పట్లో యుద్ధ విమానాల కారణంగా ఏర్పడిన సోనిక్ బూమ్ అని భావించారు. గతేడాది ఇలాంటి శబ్దాలు రాగా, ఇవి యుద్ధ విమానం పరీక్షిస్తున్నప్పుడు వచ్చిన శబ్దాలు అని హిందూస్థాన్ ఏరోనాటిక్స్ లిమిటెడ్ (హాల్) వెల్లడించింది.

తాజాగా మరోసారి అదే రీతిలో భారీ శబ్దాలు రావడంతో ప్రజలు ఏం జరుగుతుందో అర్థంకాక ఆందోళనకు లోనయ్యారు. నిన్న మధ్యాహ్నం ఈ భారీ శబ్దాలు రావడంతో నగరంలోని రాజరాజేశ్వరి నగర్ లో కొన్ని ఇళ్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. అయితే ఇది భూకంపం కాదని కర్ణాటక స్టేట్ డిజాస్టర్ మేనేజ్ మెంట్ సంస్థ వెల్లడిచింది.

More Telugu News