Kiwis: కొరకరానికొయ్యల్లా న్యూజిలాండ్ ఓపెనర్లు... ఒక్క వికెట్టూ తీయలేకపోయిన టీమిండియా బౌలర్లు

  • కాన్పూర్ లో టీమిండియా వర్సెస్ న్యూజిలాండ్
  • తొలి ఇన్నింగ్స్ లో భారత్ 345 పరుగులకు ఆలౌట్
  • రెండో రోజు ఆటచివరికి కివీస్ 129/0
  • అర్ధసెంచరీలతో రాణించిన న్యూజిలాండ్ ఓపెనర్లు
Kiwis openers registered fifties in Kanpur Test

కాన్పూర్ టెస్టులో టీమిండియాకు ఊహించని పరిణామం ఎదురైంది. సొంతగడ్డపై మన బౌలర్లకు ఎదురేముంది అని భావించిన టీమిండియా... కివీస్ ఓపెనర్ల పట్టుదల చూసి తీవ్ర నిరాశకు గురైంది. రెండో రోజు ఆటలో తొలి ఇన్నింగ్స్ లో టీమిండియా 345 పరుగులకు ఆలౌటైంది. ఆపై, ప్రత్యర్థిని పేస్, స్పిన్ ఉచ్చులో ఉక్కిరిబిక్కిరి చేద్దామని భావించిన భారత జట్టుకు ఆశాభంగం కలిగింది. భారత బౌలర్లు కనీసం ఒక్క వికెట్ కూడా తీయలేకపోయారు.

రెండో రోజు ఆట చివరికి కివీస్ స్కోరు వికెట్ నష్టపోకుండా 129 పరుగులు. ఓపెనర్లు విల్ యంగ్ 75 పరుగులతోనూ, టామ్ లాథమ్ 50 పరుగులతోనూ క్రీజులో ఉన్నారు. ముఖ్యంగా విల్ యంగ్ భారత బౌలింగ్ ను అలవోకగా ఎదుర్కొన్నాడు. అతడి స్కోరులో 12 ఫోర్లున్నాయి. ఈ జోడీపై ఇషాంత్ శర్మ, ఉమేశ్ యాదవ్, అశ్విన్, జడేజా, అక్షర్ పటేల్ ఏమాత్రం ప్రభావం చూపలేకపోయారు.

స్టార్ బౌలర్లు జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ షమీ లేకపోవడంతో కొత్త బంతితో భారత పేస్ బౌలింగ్ విభాగం ఏమాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఈ నేపథ్యంలో, రేపు ఉదయం పిచ్ పై తేమను సద్వినియోగం చేసుకుని కివీస్ టాపార్డర్ ను దెబ్బతీయాలని టీమిండియా శిబిరం భావిస్తోంది.

More Telugu News