UK: కొత్త వేరియంట్ భయం... ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై బ్రిటన్ నిషేధం... అదే బాటలో ఇటలీ, జర్మనీ

UK bans flights from six countries in the wake of new corona variant
  • ఒకే వేరియంట్ లో 30కి పైగా ఉత్పరివర్తనాలు
  • ఆఫ్రికా దేశాల్లో వెలుగు చూసిన కొత్త వేరియంట్
  • బి.1.1529గా నామకరణం
  • 6 దేశాల విమానాలపై బ్రిటన్ నిషేధం
  • ఇప్పటికే నిషేధం ప్రకటించిన ఇజ్రాయెల్
దక్షిణాఫ్రికా సహా మరో రెండు దేశాల్లో వెలుగు చూసిన కరోనా కొత్త వేరియంట్ పట్ల పలు దేశాల్లో ఆందోళన పెరుగుతోంది. సెకండ్ వేవ్ విజృంభణ నుంచి ఇప్పుడిప్పుడే కోలుకుంటున్న దశలో ఈసారి మరింత శక్తిమంతమైన కరోనా స్ట్రెయిన్ వ్యాపిస్తుండడం అనేక దేశాలను కలవరపరుస్తోంది. ఈ సూపర్ స్ట్రెయిన్ కు బి.1.1529గా నామకరణం చేశారు.

ఒక్క వేరియంట్ లో 30కి పైగా జన్యు ఉత్పరివర్తనాలు ఉండడం, వాటిలో కొన్ని స్పైక్ మ్యుటేషన్లు ఉండడం పరిశోధకులను విస్మయానికి గురిచేస్తోంది. డెల్టా వేరియంట్ లో 15 వరకు ఉత్పరివర్తనాలు ఉండగా, బి.1.1529 సూపర్ స్ట్రెయిన్ లో అంతకు రెట్టింపు ఉన్నాయి. దక్షిణాఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ దేశాల్లో ఇది ఉనికిని చాటుకుంది.

ఈ నేపథ్యంలో 6 ఆఫ్రికా దేశాల నుంచి వచ్చే విమానాలపై బ్రిటన్ నిషేధం ప్రకటించింది. దక్షిణాఫ్రికా, బోట్సువానా, నమీబియా, జింబాబ్వే, లెసోతో, ఎస్వాటిని దేశాల నుంచి వచ్చే విమానాలకు తమ దేశంలో ప్రవేశం లేదని బ్రిటన్ ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. బ్రిటన్ లో ఇప్పటివరకు కొత్త వేరియంట్ తో పాజిటివ్ కేసులేవీ నమోదు కాకపోయినా, గత 10 రోజుల వ్యవధిలో దక్షిణాఫ్రికా నుంచి వచ్చినవారు కరోనా పరీక్షలు చేయించుకోవాలని అక్కడి ప్రభుత్వం సూచిస్తోంది.

కాగా, ఈ ఆరు దేశాలను ఇజ్రాయెల్ ఇప్పటికే రెడ్ లిస్టులో చేర్చింది. జర్మనీ కూడా ప్రధానంగా దక్షిణాఫ్రికా నుంచి వచ్చే విమానాలపై నిషేధం విధించాలని యోచిస్తోంది. అదే బాటలో ఇటలీ సైతం ఆఫ్రికా ఖండంలోని దక్షిణాది దేశాల నుంచి వచ్చే వారిపై నిషేధం ప్రకటించింది.
UK
Ban
Flights
Corona Virus
New Variant
B.1.1529

More Telugu News