కరోనా కొత్త వేరియంట్ పై రాష్ట్రాలను అప్రమత్తం చేసిన కేంద్రం

25-11-2021 Thu 22:14
  • దక్షిణాఫ్రికా, బోట్సువానా, హాంకాంగ్ లో కొత్త వేరియంట్
  • బి.1.1529గా నామకరణం
  • రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు కేంద్రం లేఖ
  • విదేశాల నుంచి వచ్చేవారి పట్ల జాగ్రత్తగా ఉండాలని సూచన
Center alerts states and UTs over new corona variant
దక్షిణాఫ్రికా, బోట్సువానా, హంకాంగ్ దేశాల్లో వెలుగుచూసిన కరోనా కొత్త వేరియంట్ లో 32 జన్యు ఉత్పరివర్తనాలు ఉండడం, ముఖ్యంగా దానిలో స్పైక్ మ్యుటేషన్లు ప్రమాదకరమైనవని పరిశోధకులు చెబుతుండడం తెలిసిందే. ఇది వ్యాక్సిన్లను సైతం ఏమార్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో కొత్త వేరియంట్ పై జాగరూకతతో ఉండాలని కేంద్ర ప్రభుత్వం స్పష్టం చేసింది ఈ మేరకు కేంద్ర ఆరోగ్య శాఖ కార్యదర్శి రాజేష్ భూషణ్ రాష్ట్రాలకు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

విదేశాల నుంచి వచ్చేవారి పట్ల కఠిన నిబంధనలు అమలు చేయాలని, ముఖ్యంగా హాంకాంగ్, దక్షిణాఫ్రికా దేశాల నుంచి వచ్చేవారిని నిశితంగా పరిశీలించాలని సూచించింది. ఇటీవల అంతర్జాతీయ ప్రయాణ ఆంక్షలు సడలించారని, మళ్లీ కరోనా వ్యాప్తి పుంజుకునే అవకాశం ఉందని కేంద్రం అభిప్రాయపడింది. కొత్త వేరియంట్ తో కరోనా మరింతగా విస్తరించవచ్చని పేర్కొంది.

కాగా, నూతన కరోనా వేరియంట్ కు బి.1.1529గా నామకరణం చేశారు. ఇది బి.1.1 రకం నుంచి రూపాంతరం చెందినట్టు పరిశోధకులు అంచనా వేశారు. దీనిలో అత్యధిక జన్యు ఉత్పరివర్తనాల నేపథ్యంలో దీన్ని 'సూపర్ స్ట్రెయిన్' గా పిలుస్తున్నారు. కొత్త రకం కరోనా స్ట్రెయిన్ పై చర్చించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ అత్యవసర సమావేశం నిర్వహించింది.