రోడ్లు కత్రీనా చెంపల్లా మెరిసిపోవాలన్న రాజస్థాన్ మంత్రి... మండిపడుతున్న బీజేపీ

25-11-2021 Thu 18:26
  • మంత్రిగా ఇటీవల ప్రమాణస్వీకారం చేసిన రాజేంద్ర సింగ్
  • తన నియోజకవర్గంలో సభ
  • రోడ్ల అంశంలో కత్రీనా ప్రస్తావన
  • మంత్రిపై కఠిన చర్యలు తీసుకోవాలన్న బీజేపీ
BJP fires on Rajasthan newly sworn minister Rajendra Singh
రాజస్థాన్ మంత్రిగా కొన్నిరోజుల కిందట ప్రమాణస్వీకారం చేసిన రాజేంద్ర సింగ్ గుడ్డా రహదారుల అంశంపై చేసిన వ్యాఖ్యలు విమర్శలకు దారితీశాయి. తన ఉదయ్ పూర్వాటి నియోజకవర్గంలోని రోడ్లు బాలీవుడ్ నటి కత్రీనా కైఫ్ చెంపల్లా తళతళా మెరిసిపోవాలని రాజేంద్ర సింగ్ ఓ సభలో వ్యాఖ్యానించారు. మరి రాష్ట్రంలో రోడ్ల సంగతి అంటూ సభికులు ప్రశ్నించగా, రాష్ట్రంలోని రోడ్లు కూడా కత్రీనా చెంపల్లా తళుక్కుమనాలని పునరుద్ఘాటించారు.

రాజేంద్ర సింగ్ ఇటీవలే గెహ్లాట్ మంత్రివర్గంలో స్థానం సంపాదించారు. అయితే, ఆయన వ్యాఖ్యల పట్ల విపక్ష బీజేపీ మండిపడుతోంది. బీజేపీ  అధికార ప్రతినిధి రామ్ లాల్ శర్మ స్పందిస్తూ, ఓ మహిళ ప్రస్తావన తెస్తూ అలాంటి వ్యాఖ్యలు చేయడం అనుచితం అని పేర్కొన్నారు. సదరు మంత్రిపై సీఎం గెహ్లాట్ కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. రాజ్యాంగ బద్ధమైన పదవిలో ఉంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడం రాజస్థాన్ సంస్కృతి, సంప్రదాయం కాదని హితవు పలికారు.