జూనియర్ ఎన్టీఆర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేసిన బుద్ధా వెంకన్న

25-11-2021 Thu 17:31
  • చంద్రబాబు కుటుంబంపై వైసీపీ నేతల అనుచిత వ్యాఖ్యలు
  • జూనియర్ ఎన్టీఆర్ స్పందనపై మండిపడుతున్న టీడీపీ శ్రేణులు
  • కొడాలి నానికి ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది తారకేనన్న బుద్ధా వెంకన్న
Budda Venkanna fires on Junior NTR
టీడీపీ అధినేత చంద్రబాబు సతీమణి భువనేశ్వరిపై వైసీపీ నేతలు అనుచిత వ్యాఖ్యలు చేసిన తర్వాత ఏపీలో రాజకీయ పరిస్థితి వేడెక్కింది. ముఖ్యంగా కొడాలి నాని, వల్లభనేని వంశీలకు అత్యంత సన్నిహితుడైన జూనియర్ ఎన్టీఆర్ ను టీడీపీ శ్రేణులు టార్గెట్ చేస్తున్నాయి. సొంత మేనత్తను, మామను వీరు కామెంట్ చేస్తుంటే ఎన్టీఆర్ సుతిమెత్తగా మాట్లాడటం టీడీపీ శ్రేణులకు రుచించడం లేదు.

తాజాగా టీడీపీ నేత బుద్ధా వెంకన్న మాట్లాడుతూ... భువనేశ్వరిపై కొడాలి నాని చేసిన వ్యాఖ్యలు వింటుంటే తమ రక్తం మరిగిపోతోందని అన్నారు. కొడాలి నాని మాటలపై సింహాద్రిలానో, ఆదిలానో జూనియర్ ఎన్టీఆర్ విరుచుకుపడతాడనుకుంటే... చాగంటి ప్రవచనాలు చెపుతున్నట్టు స్పందించాడని అన్నారు. వారిని హెచ్చరించకుండా ఎందుకు ఎన్టీఆర్ ఎందుకు వదిలేశాడని ప్రశ్నించారు. తారక్ స్పందనను చూసిన ప్రతి ఒక్క తెలుగుదేశం కార్యకర్త బాధపడుతున్నాడని అన్నారు. అసలు జూనియర్ ఎన్టీఆర్ స్పందించకపోయి ఉన్నా బాగుందేది అని చెప్పారు. కొడాలి నానికి తొలుత ఎమ్మెల్యే టికెట్ ఇప్పించింది జూనియర్ ఎన్టీఆరేనని అన్నారు.