కౌలుకు తీసుకున్న పొలంలో వరికోతల్లో కొడవలి పట్టిన సీబీఐ మాజీ జేడీ లక్ష్మీనారాయణ

25-11-2021 Thu 15:01
  • వ్యవసాయంపై ఆసక్తి చూపుతున్న లక్ష్మీనారాయణ
  • తూర్పు గోదావరి జిల్లా ధర్మవరంలో కౌలు సాగు
  • కోతకు వచ్చిన వరిపంట
  • ఫొటోలను పంచుకున్న సీబీఐ మాజీ జేడీ
CBI Former JD Lakshminarayana joins paddy harvesting
సీబీఐ మాజీ జేడీ వీవీ లక్ష్మీనారాయణ పదవీవిరమణ అనంతరం రాజకీయాలపై ఆసక్తితో జనసేన పార్టీలో చేరారు. అయితే పార్టీ విధానాలు నచ్చకపోవడంతో ఆయన వైదొలిగారు. అనంతరం లక్ష్మీనారాయణ రాష్ట్రంలో రైతులతో మమేకం అయ్యేందుకు ప్రయత్నించారు. అనేక ప్రాంతాల్లో పర్యటించి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. అంతేకాదు, వ్యవసాయంపైనా ఆసక్తి చూపించారు.

ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా ధర్మవరం వద్ద పొలం కౌలుకు తీసుకుని వరి సాగు చేస్తున్నారు. పంట కోతకు రావడంతో స్వయంగా కొడవలి పట్టారు. కూలీలతో కలిసి తాను కూడా వరికోతల్లో పాల్గొన్నారు. కాగా, తన పొలంలో 4 రకాల స్థానిక వరి రకాలను పండించానని లక్ష్మీనారాయణ వెల్లడించారు. అది కూడా ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేశామని వివరించారు. ఇవాళ కోతలు జరుగుతున్నాయని తెలిపారు.